Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేడిపల్లి మండలంలో రెండు గదుల ఇండ్ల విచారణ ముమ్మరం
- లబ్ధిదారులకు అందేది ఎప్పుడు?
నవతెలంగాణ-బోడుప్పల్
మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండల పరిధిలోని బోడుప్పల్, పీర్జాదిగూడ కార్పొరేషన్ల పరిధిలో రెండు గదుల ఇండ్ల కోసం సుమారు 10,300 దరఖాస్తులు అందాయని మేడిపల్లి తహసీల్దారు ఏస్తేర్ అనిత తెలిపారు. వీరిలో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకుగాను హౌసింగ్ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ వారిచే క్షుణ్ణంగా దరఖాస్తుల పరిశీలన విచారణ జరుపుతారని, అందులో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో లాటరీ ద్వారా ఎంపిక చేస్తారని అన్నారు.
దరఖాస్తులు 10300 - యూనిట్లు 316
మేడిపల్లి మండల పరిధిలోని బోడుప్పల్ కార్పొరేషన్, పీర్జాదిగూడ కార్పొరేషన్ల పరిధిలో రెండు గదుల ఇండ్ల కోసం ఇప్పటి వరకు సుమారు 10300 మంది దరఖాస్తులు చేసుకోగా ఈ ప్రాంతంలో మాత్రం కేవలం 316 యూనిట్లు (ఇండ్లు) నిర్మించారు. బోడుప్పల్లో 4757 దరఖాస్తులు రాగా, ఇక్కడ కేవలం 472 ఇండ్లు నిర్మాణం మాత్రమే జరిగింది. చెంగిచెర్లలో 472 మంది దరఖాస్తులు చేసుకోగా ఇక్కడ 40 ఇండ్లను మాత్రమే నిర్మాణం చేశారు. పీర్జాదిగూడలో 2068 దరఖాస్తులు చేసుకోగా, ఇక్కడ 74 ఇండ్లను మాత్రమే నిర్మించారు. మేడిపల్లిలో 1723 దరఖాస్తులు చేసుకోగా, ఇక్కడ కేవలం 48 ఇండ్లను మాత్రమే నిర్మించారు, పర్వతాపురంలో 646 దరఖాస్తులు రాగా, ఇక్కడ కేవల 80 ఇండ్లను మాత్రమే నిర్మించారు. అయితే దరఖాస్తులు చేసుకున్న వారిలో ఎవరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు దక్కుతాయో చూడాలి.
అర్హులైన వారందరికీ ఇండ్లు ఇవ్వాలి
ఎన్.సృజన, సీపీఐ(ఎం) మేడిపల్లి మండల కార్యదర్శి
మేడిపల్లి మండల పరిధిలో అర్హులైన వారందరికీ రెండు గదుల ఇండ్లు అందిం చాలని సీపీఐ(ఎం) మేడి పల్లి మండల కార్యదర్శి ఎన్.సృజన డిమాండ్ చేశారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు అర్హులకు ఇండ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత తనదేనని మాట ఇచ్చారని, అయితే అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు గడిచినా కూడా పేదలకు ఎక్కడ కూడా రెండు గదుల ఇండ్లను ఇచ్చిన పాపాన పోలేదని వాపోయారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ స్థలాలను పరిరక్షించి, పేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.