Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
రైల్వే స్టేషన్లలో తల్లులు స్వేచ్ఛగా శిశువులకు పాలిచ్చేవిధంగా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే, హైదరాబాద్ ఈస్ట్ రోటరీ క్లబ్, రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150 సహకారంతో శిశువుకు పాలివ్వడానికి తల్లులకు సౌకర్యవంతంగా ఉండేలా హైదరాబాద్ (నాంపల్లి) ప్లాట్ఫారం నెం.4 వద్ద ఈ ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. సోమవారం నగర పోలీస్ అడిషనల్ కమిషనర్ శిఖగోయల్ ఈ గదిని ప్రారంభించారు. ఈ సందర్భంగా శిఖగోయల్ మాట్లాడుతూ హైదరాబాద్ జంట నగరాలో ప్రధానమైన హైదరాబాద్ రైల్వే స్టేషన్లో శిశువుకు పాలివ్వడానికి ప్రత్యేక గది ఏర్పాటు చేసిన రోటరీ క్లబ్ వారిని అభినందించారు. రోటరీ క్లబ్ వారు చేస్తున్న సేవలను కొనియాడారు. రైళ్లలో ప్రయాణించే తల్లులకు, శిశువుకు ప్రయోజనం కలిగించేలా కొన్ని ప్రధానమైన రైల్వే స్టేషన్లలో రోటరీ క్లబ్ వారి సహకారంతో ఇటువంటి ప్రత్యేక గదులు, క్యూబికల్స్ ఏర్పాటుకు రైల్వే ప్రణాళికు రూపొందిస్తుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ డివిజన్ అడిషినల్ డివిజినల్ రైల్వే మేనేజర్ (ఏడీఆర్ఎమ్) ప్రదీప్ రాథోర్, హైదరాబాద్ రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ 3150 ఎన్.వి.హనుమంత్ రెడ్డితోపాటు రైల్వే సీనియర్ అధికారులు, రోటరీ సభ్యులు పాల్గొన్నారు.