Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
పదవి ఉన్నా లేకున్నా పేదలు, గిరిజనుల కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర నాయకులు కుంజా బుజ్జి అని కుత్బుల్లాపూర్ సీపీఐ(ఎం) కార్యదర్శి కీలుకాని లక్ష్మణ్ అన్నారు. సోమవారం కుత్బుల్లాపూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో షాపూర్‌నగర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ సాయూధ రైతాంగ పోరాటంలో నాయకుల సద్దిమూటలు మోసి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిజాం ప్రభుత్వంపై పోరాడిన వ్యక్తి కుంజా బుజ్జి అని అన్నారు. పోడు భూముల్లో వ్యవసాయం చేసుకునే హక్కు గిరిజనులకు కల్పించాలని, 170 చట్టం అమలు చేయాలని పలు ఉద్యమాల్లో పాల్గొని గిరిజనులకు అండగా నిలిచారన్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన తనకు వస్తున్న ఎమ్మెల్యే అలవెన్స్‌లు మొత్తం కూడా పార్టీకి ఇచ్చి, పార్టీ ఇచ్చే అలెవెన్స్లతో తన జీవితాన్ని గడిపారన్నారు. అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం పేదలకు, గిరిజనులకు పార్టీకి తీరని లోటన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు కె.బీరప్ప, మహిళా సంఘం కుత్బుల్లాపూర్ మండల అధ్యక్షురాలు జమున, సీపీఐ(ఎం) పార్టీ నాయకులు స్వాతి, లత, సంజీవరాజు, ఖలీల్, అబ్దుల్ జాకీర్ తదితరులు పాల్గొన్నారు.