Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
నేర పరిశోధనలో సీసీ కెమెరాలు ఎంతో కీలకంగా ఉంటాయని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అన్నారు. సోమవారం మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో 150 కమ్యూనిటీ సీసీ కెమెరాలను లక్ష్మీసాయి గార్డెన్లో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి డీసీపీ రక్షిత కె. మూర్తి, ఏసీపీ శ్యాం ప్రసాద్, కుషాయిగూడ ఏసీపీ శివకుమార్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం అన్నారు. 2007లో మల్కాజిగిరి డీసీపీగా పని చేసినప్పుడు గంటకు ఐదు చైన్ స్నాచింగ్‌లు, రాత్రిపూట దొంగతనాలు జరిగేవని వీటి నియంత్రణకు 'కమ్యూనిటీ పోలీసింగ్', 'మేము సైతం' కార్యక్రమాలు తీసుకువచ్చి సీసీ కెమెరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. కాలనీలలో, ప్రధాన రహదారులపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా ఆయా ప్రాంతాల ఎస్.హెచ్.ఓ లు విస్తతంగా ప్రచారం చేశారని చెప్పారు. ఇందులో భాగంగా మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో 150 సీసీ కెమెరాలను ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతో స్థానికులు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని ఆయన కొనియాడారు. కమిషనరేట్ పరిధిలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసి అక్కడి నుంచి పర్యవేక్షిస్తారని తెలిపారు. ప్రస్తుతం70 శాతం కేసులు సీసీ కెమెరాల ద్వారానే పరిశీలిస్తున్నామని వివరించారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే ఆయా ప్రాంతాలలో నేరస్థులు తిరగడానికి భయపడతారని, ప్రజలు ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే మైనంపల్లి మాట్లాడుతూ... సీసీ కెమెరాల ద్వారా శాంతి భద్రతల పరిరక్షణ సులభతరంగా ఉంటుందని, సర్కిల్లోని అన్ని కాలనీలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, శ్రావణ్ కుమార్, మేకల సునీత యాదవ్, సునీతా శేఖర్ యాదవ్, మాజీ కార్పొరేటర్ జగదీష్‌గౌడ్, నక్క ప్రభాకర్ గౌడ్, రాము యాదవ్, సతీష్ కుమార్, గుండా నిరంజన్, ఉపేందర్ రెడ్డి, సీఐ జగదీశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.