Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇబ్బందులు పడుతున్న స్థానికులు
- డంపింగ్‌యార్డు ఎత్తివేయాలని డిమాండ్
నవతెలంగాణ-అంబర్‌పేట
అంబర్‌పేట డివిజన్ దుర్గానగర్ వీకర్ సెక్షన్ కాలనీలోని డంపింగ్ యార్డ్‌లో చెత్త పేరుకుపోయింది. 3 రోజులుగా చెత్త ఎత్తకపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో స్ధానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీకర్ సెక్షన్ హౌసింగ్ కాలనీ సంక్షేమ సంఘం పరిసర ప్రాంతాలలో తీవ్రమైన వాసనతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. చెత్త పేరుకుపోయి రోడ్లపైకి వచ్చి స్ధానికులు, వాహనదారులు వెళ్లడానికి కూడా వీలు లేకుండా పోయింది. జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకపోవడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా విజృంభిస్తుండటంతో పరిసరాల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు వస్తాయోనని భయాందోళనకు గురవుతున్నారు. డంపింగ్ యార్డ్‌ను తొలగించాలని అధికారులకు ఎన్ని మెమోరాండాలు ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. కరోనా తీవ్రంగా ఉన్న పరిస్థితులలో పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని స్ధానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే జీహెచ్ఎంసీ అధికారులు పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించడంతో పాటు డంపింగ్ యార్డ్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు.