Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెన్త్‌లో 75,271, ఇంటర్లో 73,200 మంది విద్యార్థులకు ఊరట
- టెన్త్ ఎఫ్ఏ-1 మార్కులు అప్లోడ్ చేయాలని ఆదేశాలు
- ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు వాయిదా
నవతెలంగాణ-సిటీబ్యూరో
పబ్లిక్ ఎగ్జామ్స్‌ను రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ పరీక్షలపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకుంది. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆందోళనలు, ఇన్‌కంప్లీట్ సిలబస్ వంటి కారణాలతో టెన్త్బోర్డు ఎగ్జామ్స్తోపాటు ఇంటర్ ఫస్ట్ఇయర్ పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షల నిర్వహణపై జూన్‌లో సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ ప్రకటించింది. గురువారం పరీక్షల నిర్వహణపై టెన్త్, ఇంటర్‌బోర్డు అధికారులతో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ సమావేశం నిర్వహించారు. అనంతరం పరీక్షల రద్దు, వాయిదా ప్రతిపాదనలకు సబంధించిన దస్త్రాలను సీఎం కేసీఆర్‌కు పంపించగా అందుకు ఆయన ఆమోదముద్ర వేసినట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
పై తరగతులకు 1.48 లక్షలకుపైగా విద్యార్ధులు :
హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు పాఠశాలలు 1434 వరకు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ(8564), ఎయిడెడ్(3898), ప్రయివేటు(62,809) పాఠశాలలు కలిపి మొత్తం 75,271 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇక జూనియర్ కాలేజీలు అన్నీ కలిపి 321 ఉండగా.. వీటిల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 73,200 మంది, సెకండియర్‌లో 82,300 విద్యార్థులు న్నారు. మొత్తం 1,55,500 మంది విద్యనభ్యసిస్తున్నారు. ఇదిలావుంటే ఇంటర్ విద్యార్థులకు మే 1 నుంచి 20వరకు, టెన్త్ విద్యార్థులకు మే 17నుంచి 26వరకు వార్షిక పరీక్షలు జరగాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు సైతం జిల్లా యంత్రాంగం దాదాపు పూర్తిచేసింది. ఇంకోవైపు ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్లైన్ క్లాసులను నిర్వహిస్తు న్నారు. ఈ సమయంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుం డడంతో సర్కారు మరోసారి విద్యాసంస్థలను బంద్పెట్టింది. అదే సమయంలో ఆన్లైన్ క్లాసులను యథావిధిగా నిర్వహించాలని ఆదేశించింది. కానీ విద్యార్థులకు డిజిటల్ పాఠాలు అర్థం కావడం లేదు. మరోవైపు వార్షిక పరీక్షలకు సమయం ముంచుకొస్తుండడంతో పాటు 70శాతం సిలబస్‌లో 50శాతంలోపే పూర్తయ్యింది. ఫలితంగా పరీక్షల నిర్వహణపై అందరిలోనూ గందగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా వార్షిక పరీక్షలను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు భారీ ఊరట లభించినట్టయ్యింది.
ఎఫ్ఏ-1 మార్కుల ఆధారంగా గ్రేడ్లు..
పదో తరగతి వార్షిక పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇక అందరి దృష్టి ఫలితాలపై పడింది. అయితే టెన్త్ బోర్డు నిర్ణయించే ఆబ్జెక్టివ్ విధానం ద్వారా ఫలితాలు వెల్లడిస్తామని సర్కారు స్పష్టం చేసింది. ఇదే సమయంలో టెన్త్ ఫలితాలపై ఎవరికైనా సంతృప్తి లేకపోతే పరీక్షలకు అవకాశం ఇస్తామని ప్రకటించింది. ఇదిలావుంటే గతనెల 15నుంచి ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ-1) పరీక్షలను టెన్త్ విద్యార్థులకు జిల్లా అధికారులు నిర్వహించారు. ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా అంతర్గత మార్కులను రూపొందిస్తారు. సబ్టెక్టుకు 20 మార్కుల చొప్పున కేటాయిస్తారు. గతేడాది తరహాలోనే ఇంటర్నల్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్లను కేటాయిస్తారు. ఎఫ్ఏ-1 మార్కులను ప్రభుత్వ పరీక్షల విభాగం(డీజీఈ) సైట్లో అప్లోడ్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేస్తారు. ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు ఇచ్చే 25శాతం వెయిటేజీని రద్దు చేశారు.