Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేటీఆర్ ఓరుగల్లు పర్యటనలో ఘటన
- మానవ హక్కుల కమిషన్‌కు ఫిిర్యాదు
- దళిత బీసీ నాయకుడు దాసు సురేశ్
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
ఇటీవల కేటీఆర్ వరంగల్ పర్యటనలో భాగంగా తమ సమస్యలను వెలిబుచ్చడానికి బయలుదేరిన లక్ష్మీపురం సాకరాశికుంట దళిత మహిళలపై పురుష పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి వారి అభ్యర్ధన పత్రాలను, ఆధార్ కార్డులను చించేసి దళిత బీసీ నాయకుడు దాసు సురేశ్‌ను అరెస్ట్ చేసిన దరిమిలా ఇట్టి విషయాన్ని గురువారం నాడు బాధితులు నాంపల్లిలోని మానవ హక్కుల కమిషన్‌లో ఫిిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యయుతంగా తమ సమస్యలను ప్లకార్డులతో మంత్రి కేటీఆర్ దష్టికి తీసుకెళ్లడానికి శాంతియుతంగా ప్రయత్నిస్తే తమపై పోలీసులు దాడిచేయడం దారుణమని స్థానిక మహిళా నాయకురాలు ఈసంపెల్లి బేబి మండిపడ్డారు. ఆరేళ్ళ క్రితం ఇదే ప్రాంతంలో కేసీఆర్ పక్కా ఇళ్లకు శంకుస్థాపన చేసి తమకు ఇచ్చిన సొంత ఇంటి హామీని మరచి, మరలా నగరంలో ప్రారంభోత్సవ కార్యక్రమాలను చేపట్టడానికి లక్ష్మీపురానికి కేటీఆర్‌ను ఏ మొఖంతో పంపించారో ఇక్కడి ప్రజలకు చెప్పాలన్నారు. కల్లు గూడాలు అంటూ పేదవారి అమాయకత్వాన్ని కేసీఆర్, కేటీఆర్ తమ అవకాశంగా మలుచుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పరిపాలన పాశవికంగా మారిందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి దాసు సురేశ్ ఆరోపించారు. వరంగల్ లక్ష్మీపురంలో ఆరేళ్ళ క్రితం కేసీఆర్ ఇచ్చిన హామీలను అడగబోతే స్థానికులపై మహిళలని కూడా చూడకుండా పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం అమానవీయమని దాసు సురేశ్ ఆరోపించారు. కేటీఆర్ వరంగల్ పర్యటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి వరద ముంపు బాధితుల ఆధార్ కార్డులు చించేయడం తీవ్ర ఆక్షేపణీయమన్నారు. ఇది ముమ్మాటికీ మానవ హక్కుల ఉల్లంఘనే అని, అందుకే మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించామన్నారు. ఆరేళ్లక్రితం లక్ష్మీపురం, సాకరాశికుంట, గరీబ్ నగర్ తదితర ప్రాంతాలకు కేసీఆర్ ఇచ్చిన పక్కా ఇళ్ళ హామీలను కేటీఆర్‌కు గుర్తుచేయడానికి ప్రయత్నించిన బాధితులను పోలీసులు రోడ్డుపై ఈడ్చుకెళ్లి లాఠీలతో దాడి చేయడం దారుణమన్నారు. లేడీ పోలీసులు లేకుండా మహిళలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం చట్టరీత్యా నేరమని దాసు సురేశ్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి కోల జనార్ధన్, బీసీ రక్షక్ దళ్ అధ్యక్షులు ఉదరు, బీసీ యువజన సంఘం కార్యదర్శి లింగాల హరీష్ గౌడ్, యువ నాయకులు మడత కిషోర్, భాదితులు ఈసంపల్లి బేబీ ,రేణుకుంట అనిల్ తదితరులు పాల్గొన్నారు.