Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
అంబర్‌పేట తహశీల్దార్ కార్యాలయం గోడలు బీటలు వారి శిథిలావస్తకు చేరుకుందని అదే స్థలంలో నూతన భవనాన్ని నిర్మించాలని కోరుతూ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు బి.దీపక్‌కుమార్ గురువారం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబర్‌పేట, మలక్‌పేటకు చెందిన ఎంతో మంది ప్రజలు తమ వినతులను అందజేయడానికి తహశీల్దార్ కార్యాలయానికి వస్తుంటారని నిత్యం రద్దీతో ఉండే భవనం శిథిలావస్థకు చేరుకుందని అన్నారు. వర్షాకాలంలో నీరు చేరి రికార్డులు తడిసిపోతున్నాయని, అధికారులు, సిబ్బంది పనిచేయడానికి రూములు సరిగా లేవని అన్నారు. కనీసం తాగడానికి నీరు, టాయిలెట్స్ లేక సందర్శకులు అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉందన్నారు. పెన్షన్ కోసం వచ్చే వృద్ధులు కూర్చోవడానికి ఎలాంటి సౌకర్యాలు లేవని అన్నారు. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా వెంటనే నూతన భవన నిర్మాణం చేపట్టాలని కేంద్రమంత్రిని కోరినట్లు చెప్పారు. నూతన భవనం కోసం త్వరలోనే ప్రణాళికలు తయారు చేసి నిర్మాణం చేపడతామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హామి ఇచ్చినట్లు చెప్పారు.