Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బుధవారం 446 పాజిటివ్ కేసులు
- శివారుప్రాంతాల్లోనే అధికం
- చార్మినార్, గోల్కొండ మూత
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. 400లకు పైగానే నమోదుతుండడంతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా శివారుప్రాంతాల్లోనూ కేసుల సంఖ్య పెరుగుతుంది. కేసులతోపాటు మరణాల సంఖ్య సైతం పెరుగుతుంది. బుధ, గురువారాల్లో గాంధీ ఆస్పత్రిలో 35 మంది మృతి చెందారు. ఒకపక్క వ్యాక్సిన్ ఇస్తుంటే మరో పక్క కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతోపాటు బహిరంగ ప్రదేశాల్లో మాస్కుల్లేకుంటే రూ.1000 జరిమాన విధిస్తున్నారు. కరోనా కేసుల ఉధృతి పెరుగుతున్న తరుణంలో కరోనా నివారణ చర్యలు నామమాత్రమే.
శివారుప్రాంతాల్లో
దిలీసుఖ్నగర్, ఎల్బీనగర్, సరూర్‌నగర్ ప్రాంతాల్లో కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎల్బీనగర్ జోన్ పరిధిలోని కరోనా పరీక్ష కేంద్రాల్లో రోజుకు 1500మందికి పరీక్ష చేయగా సుమారు 500 మందికి పాజిటివ్‌గా వస్తున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. సరూర్‌నగర్‌లోని ఆస్పత్రిలో 200 మందికి పరీక్షలు నిర్వహిస్తే 50-60మందికి పాజిటివ్ వస్తున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. మన్సూరాబాద్‌లోని పట్టణ ఆరోగ్య కేంద్రం, బాలాపూర్ కేంద్రం, అబ్దుల్లాపూర్‌మెట్ కేంద్రం, మలక్‌పేట ఆరోగ్య కేంద్రం, ముసారాంబాగ్ శాలినవాహననగర్, మాదన్నపేట, జాంబాగ్‌లో గడ్డిఅన్నారం, అజంపుర, హయత్‌నగర్ కేంద్రం, వనస్థలిపురం కేంద్రాల్లో చేస్తున్న పరీక్షల్లో 30శాతానికిపైగా పాజిటివ్ వస్తున్నాయి.వీటితోపాటు శేరిలింగంపల్లి, కూకట్పల్లి, చార్మినార్, సికింద్రాబాద్, ఖైరతాబాద్ జోన్లల్లోనూ కేసులు పెరుగు తున్నాయి. వారం రోజుల కేసులను పరిశీలిస్తే 10వ తేదిన 551కేసులు, 9న 487, 14వ తేదిన 446, 8వ తేదిన 402, 13వ తేదిన 361 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో
నగరంతోపాటు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. క్రమంగా అన్ని విభాగాల్లోకి కరోనా ప్రవేశించింది. ఇప్పటికే ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్, ఐటీ విబాగాల్లోని ఉద్యోగులకు పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం మూడో అంతస్తులోని పరిపాలన విభాగంలోని ఉద్యోగికి పాజిటివ్ రావడంతో శానిటైజ్ చేయడంతోపాటు ఆ విభాగాన్ని మూసేశారు. కరోనా నివారణ చర్యలు తీసుకోవాల్సిన జీహెచ్ఎంసీ కార్యాలయంలోనే కేసులు పెరుగుతుండడంతో అధికారులపై విమర్శలొస్తున్నాయి.
35 మంది మృతి
గాంధీ ఆస్పత్రిలో రెండు రోజుల్లో 35మంది కరోనాతో మృతి చెందారు. మృతుల్లో 16మంది మహిళలు, 19 మంది పురుషులు ఉన్నారని సమాచారం. వీరిలో 9మంది 45ఏండ్ల కంటే తక్కువ వయస్సున్నవారే ఉన్నట్టు తెలిసింది. అయితే కరోనా మరణాలు పెరుగుతున్న అధికారులు సీరియస్‌గా తీసుకోవడంలేదనే విమర్శలూలేకపోలేదు.
చార్మినార్, గోల్కొండ మూత
కరోనా కేసులు పెరుగుతుండడంతో పురవస్తుశాఖ మ్యూజియాలు, పర్యటక ప్రాంతాలను మూసేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే పాతబస్తీలోని చార్మినార్‌తోపాటు గోల్కోండ మ్యూజియంను గురువారం నుంచి వచ్చే 15వ తేది వరకు మూసేశారు. సాలార్జంగ్ మ్యూజియంతోపాటు ఇతర ప్రాంతాలను మూసేసే అవకాశముంది.