Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నారాయణగూడ
ప్రభుత్వ మార్గదర్శకాలను కఠినంగా అమలు చేస్తూ ఆరోగ్యకరమైన పరిశుభ్రతను పాటిస్తూ తమ కార్యకలాపాలను కొనసాగిస్తూ కరోనాను అరికట్టడానికి తోడ్పడుతున్నామని తెలంగాణ రెస్టారెంట్, బార్ లైసెన్సీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శాగంటి మనోహర్ గౌడ్, ఉపాధ్యక్షుడు కొత్త వెంకటేష్ గౌడ్ తెలిపారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గతేడాది కరోనా, లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలోని రెస్టారెంట్, బార్ల వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారని, ఉపాధి లేక వేలాది మంది బార్ కార్మికులు వీధిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తిని నివారించే ముఖ్యమైన సూత్రాలు పాటిస్తూ ఉపరితలాలను శుభ్రపరచడం, క్రిమిసంహారకం చేయడంతో సమర్థవంతంగా, సురక్షితంగా బార్లను నిర్వహిస్తున్నామన్నారు. రెస్టారెంట్లు, బార్లలో పనిచేసే ఉద్యోగులు, కస్టమర్లలో కరోనా వ్యాప్తిని తగ్గించే అనేక వ్యూహాలను అమలు చేస్తున్నామన్నారు. కోవిడ్ అంతమయ్యే వరకు, ఆ తర్వాత కూడా ఆరోగ్యకరమైన వాతావరణంలో రెస్టారెంట్లు, బార్ల కార్యకలాపాలు నిర్వహిస్తామని వారు భరోసా ఇచ్చారు. సమావేశంలో అసోసియేషన్ సభ్యులు బి.ప్రభాకర్ రెడ్డి, డి.శ్రీనివాస్ రెడ్డి, ఎం.జనార్దన్ రెడ్డి, కె.వరుణ్ రెడ్డి, ఎన్.వెంకటేష్ గౌడ్, సవేరా శ్రీనివాస్ గౌడ్, ఏ.సంతోష్ గౌడ్, పి.ఈశ్వర్ గౌడ్, జె.చందు, ఎస్.పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.