Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ప్రయివేటు పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించేలా చొరవ చూపాలని కోరుతూ రాష్ట్ర, మేడ్చల్ ట్రస్మా ప్రతినిధుóలు శుక్రవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని సెక్రటరియేట్‌లోని ఆమె చాంబర్లో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో పని చేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి నెలకు రూ. 2 వేలు, 25 కిలోల బియ్యం సర్కారు ప్రకటించిందన్నారు. యూడైస్ ప్రకారం లక్షన్నర సిబ్బందికి మాత్రమే ఈ చెల్లింపులు జరుగుతాయన్న ఊహాగానాలు వెలువడుతున్నాయన్నారు. యూడైస్‌లో ఇంకా నమోదు కాని ప్రీ ప్రయిమరీ, ఇతర ఉపాధ్యాయులను, బోధనేతర సిబ్బందిని కలుపుకోని అందరికీ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేయాలని డిమాండ్ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పదో తరగతి విద్యార్థుల ఎఫ్ఏ 1 మార్కులను శుక్రవారం సాయంత్రం 5 గంటల లోపు అప్లోడ్ చేయాలని ఆయా జిల్లా విద్యా శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారన్నారు. తక్కువ సమయంలో ఆ పని పూర్తి చేయాలనడం సబబు కాదని, ఈ నెల 26 వరకు సమయం కావాలని మంత్రిని కోరారు. కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్‌రావు, కోశాధికారి రమణరావు, మేడ్చల్ జిల్లా ట్రస్మా అధ్యక్షులు శివరాత్రి యాదగిరి, ప్రధాన కార్యదర్శి జె.నాగరాజు, కోశాధికారి ఎండీ. అజర్‌ఖాన్, జిల్లా కార్యవర్గం తదితరులు పాల్గొన్నారు.