Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు రాగ జ్యోతి
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు రాగ జ్యోతి అన్నారు. శుక్రవారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో మహిళా, శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కార్మిక, విద్య, వైద్య, పోలీస్, బాలల సంరక్షణ సంస్థలు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాలను అరికట్టడం, బాలికలపై అత్యాచారాల నిరోధక చట్టం వంటివి కఠినంగా అమలు చేయాలని, వారి హక్కులకు భంగం కలిగిస్తే కమిషన్ కఠిన చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేయదని తెలిపారు. చట్టాలను పక్కాగా అమలు చేస్తే ఇటుక బట్టీలు, హోటళ్లు, టోల్‌ప్లాజా, బస్టాండ్ వంటి ప్రాంతాల్లో యజమానులు ఎవరు కూడా చిన్నపిల్లలను పనిలోకి తీసుకోరన్నారు.
అందరూ కలిసి పని చేసినప్పుడే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందన్నారు. అనంతరం కలెక్టర్ శ్వేతా మహంతిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న అంశాలపై కలెక్టర్ వివరిస్తూ బాలల హక్కుల సాధనకు జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖలను సమన్వయం చేసి చేపట్టే కార్యక్రమాలు విజయవంతమయ్యేలా చూస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్వో లింగ్యానాయక్, రాచకొండ, సైబరాబాద్ ఏసీపీలు, ఆయా శాఖల సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.