Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గతేడాదిలో 11,538 భవనాలకు అనుమతులు
- రూ.797.13కోట్ల ఆదాయం
- జూన్ వరకు వాయిదాల్లోనే ఫీజు చెల్లింపు
నవతెలంగాణ-సిటీబ్యూరో
కరోనా మహమ్మారితో ఏడాదికాలంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మాణ పనులు తగ్గుముఖం పట్టాయి. అయితే ఇప్పుడిప్పుడే నిర్మాణ రంగం ఊపందుకుంటుంది. ప్రతి సంవత్సరం నిర్మాణాల సంఖ్య పెరుగుతుండేది. కాని గతేడాది మార్చి నుంచి కరోనా, లాక్డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు సొంతూళ్లకు వెళ్లిపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. అయినా జీహెచ్ఎంసీ భారీ సంఖ్యలోనే భవన నిర్మాణాలకు అనుమతులు జారీచేసింది. ఆశించిన స్థాయిలోనే టౌన్‌ప్లానింగ్ ద్వారా ఆదాయం వచ్చిందని అధికారులు భావిస్తున్నారు.
11,538అనుమతులు :
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో జీహెచ్ఎంసీ 11,538 భవన నిర్మాణ అనుమతులు జారీచేసింది. వీటిలో వాణిజ్య భవనాలు 149, ఆస్పత్రులు, పాఠశాలలు కలిపి 17, రెసిడెన్షియల్ భవనాలు 11,372 ఉన్నాయి. వీటితోపాటు 67 భారీ అంతస్తుల (హై రైజ్ బిల్డింగ్స్) భవనాలకు అనుమతులు జారీచేసింది. వీటిలో వాణిజ్య భవనాలు 23, ఇన్స్టిట్యూషనల్ (ఆస్పత్రులు, పాఠశాలలు) నాలుగు, రెసిడెన్షియల్ భవనాలు 40 ఉన్నాయి. భవన నిర్మాణ అనుమతుల ద్వారా జీహెచ్ఎంసీకి రూ.797.13కోట్ల ఆదాయం లభించింది.
ఫీజు చెల్లింపు వాయిదాల్లోనే
గ్రేటర్‌లోని రియల్ ఎస్టేట్ రంగంపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. కార్మికులు లేకపోవడంతో పనులు నిలిచిపోయాయి. క్రయ విక్రయాలు సైతం ఆగిపోవడంతో భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది. అయితే పడిపోయిన నిర్మాణ రంగాన్ని ఊపందుకునేలా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులోభాగంగానే భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన ఫీజును వాయిదా పద్ధతిలో చెల్లించేవిధంగా వెసులుబాటు కల్పించింది. జులై 2020 నుంచి మొదటి వాయిదాను భవన నిర్మాణ అనుమతి ఇచ్చినప్పుడే చెల్లించి మిగిలిన మూడు వాయిదాలను ప్రతి ఆరునెలలకొకసారి చెల్లించేవిధంగా అవకాశం కల్పించారు. ఒకవేళ ఒకేసారి మొత్తం చెల్లించేవారికి ఫీజులో 5శాతం తగ్గింపు ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. అయితే 31మార్చి2021 వరకు వాయిదాల పద్దతి ముగిసింది. అయితే రియల్ ఎస్టేట్ పరిశ్రమలోని సంఘాలు, పలువురు బిల్డర్లు, డవలపర్స్ వినతి మేరకు, రియల్ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహిం చేందుకుగాను వాయిదాల విధానాన్ని ఈ ఏడాది జూన్ వరకు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.