Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతి ఒక్కరూ విధిగా వ్యాక్సిన్ తీసుకోవాలి మేయర్ విజయలక్ష్మి
నవతెలంగాణ-సిటీబ్యూరో
కోవిడ్-19 మహమ్మారి నుంచి రక్షించేందుకు ప్రతి ఒక్కరూ వాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాల యంలో శనివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంపులో జర్నలిస్టులు, ఉద్యోగులకు వ్యాక్సిన్ వేశారు. ఈ కార్యక్రమాన్ని మేయర్ పరిశీలించారు. మేయర్ విజయలక్ష్మి చొరవతో ఏర్పాటుచేసిన ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జర్నలిస్టులు, ఉద్యోగులు హాజరై కో-వ్యాగ్జిన్ వ్యాక్సిన్ను వేసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రతిఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటించడంతో పాటు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ చేయించుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఫ్రంట్ లైన్ వర్కర్లు అయిన మున్సిపల్ సిబ్బందితో పాటు జర్నలిస్టులందరూ వ్యాక్సిన్ను తీసుకోవడంతో పాటు రెండో విడత వ్యాక్సిన్ కూడా విధిగా తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ పారిశుధ్య వర్కర్లందరికీ వ్యాక్సినేషన్ చేసే ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. శనివారం జీహెచ్ ఎంసీిలో నిర్వహించిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో 120 మంది జర్నలిస్టులు, ఉద్యోగులకు వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందని మేయర్ విజయలక్ష్మి తెలిపారు.
22,894 మందికి వ్యాక్సినేషన్ పూర్తి
జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులందరికీ వ్యాక్సినేషన్ పూర్తిచేయా లన్న ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నేటి వరకు 22,894 మందికి వ్యాక్సినేషన్ పూర్తిచేసినట్టు బల్దియా తెలిపింది. పారిశుధ్య, ఎంటమాలజి తదితర విభాగాలకు చెందిన 24,949 మంది కార్మికులు ఉండగా వీరిలో 92 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తిచేశారు. మిగిలిన వారిలో సెలవుల్లో ఉండడం, అనారోగ్య కారణాలు, ఉద్యోగ ఖాళీలు ఉండడం వల్లే వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తికాలేదు. మిగిలినవారిలో ముందుకువచ్చేవారికి వ్యాక్సినేషన్ ఇవ్వడానికి జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. ఎల్బీనగర్ జోన్లో మొత్తం 4,288 మంది కార్మికులు ఉండగా 4,083 మందికి వ్యాక్సినేషన్ పూర్తిచేశారు. ఖైరతాబాద్ జోన్లో 4,993 మంది కార్మికులకు గాను 4,447 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చారు. శేరిలింగంపల్లి జోన్లో 2,630 మందికి గాను 2,408 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చారు. కూకట్పల్లిజోన్లో 3,020 మందికిగాను ఇతర సిబ్బందికి కలిపి 3,772 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చారు. సికింద్రాబాద్ జోన్లో 4,798 మందికి గాను 4,641 మందికి, చార్మినార్ జోన్లో 3,543 మందికి వ్యాక్సినేషన్ పూర్తిచేశారు.
చీఫ్ మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షణలో
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో శనివారం నిర్వహించిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ (సీఎంఓహెచ్) పద్మజ పర్యవేక్షించారు. క్యాంపు ముగిసే వరకు అక్కడే ఉండి ఏర్పాట్లను పరిశీలించారు. జీహెచ్ఎంసీ ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు పలు సూచనలుతో చేస్తూ వ్యాక్సిన్ వేయించారు. ఈ కార్యక్రమంలో సీపీఆర్ఓ కె. వెంకట రమణ, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ జీవన్, హెల్త్ విభాగం, సీపీఆర్ఓ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.