Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఎస్రావు నగర్ కార్పొరేటర్‌కు బిల్డర్ హెచ్చరిక
- రంగంలో దిగిన టౌన్ ప్లానింగ్ అధికారులు
- ఐ విజన్ సిరీస్ పార్ట్ మెంట్ ప్రహరీ కూల్చివేత
నవతెలంగాణ-ఏఎస్రావు నగర్
'నువ్వు కార్పొరేటర్ అయితే నాకేంటి.. పైసలు పారేస్తా తీసుకొని వెళ్లిపో అంటూ ఓ బిల్డర్ ఏఎస్ రావు నగర్ కార్పొరేటర్ శిరీష్ సోమశేఖర్ రెడ్డికి హుకూం జారీ చేశారు. కాలనీ వాసులకు ఇబ్బందికరంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ ఫార్మర్ తీసివేయాలని, రోడ్డును కబ్జా చేస్తూ కట్టిన ప్రహరీని లోపలికి జరిపిన నిర్మించుకోవాలని కోరిన ఒక మహిళ కార్పొరేటర్‌పై సదరు బిల్డర్ దౌర్జన్యం చేశారు. దీంతో కార్పొరేటర్‌తో పాటు కాలనీ వాసులు టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో టౌన్ ప్లానింగ్ ఏసీపీ ఖుద్దుస్ ఆధ్వర్యంలో సిబ్బంది ఐ విజన్ సిరీస్ అపార్ట్ మెంట్ ప్రహరీ గోడను కూల్చి వేశారు. తొలుత కాలనీ వాసులు ఐ విజన్ సిరీస్ అపార్ట్ మెంట్ అక్రమాలను కూల్చివేయాలని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ట్రాన్స్ ఫార్మర్ ను తొలగించాలని డిమాండ్ చేస్తూ అపార్ట్ మెంట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష్ సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కాలనీ వాసులకు ఇబ్బందికరంగా ఏర్పాటుచేసిన ట్రాన్స్ ఫార్మర్ తొలగించాలని కోరితే బిల్డర్ 'డబ్బులు పారేస్తా ఏరుకొని పో'' అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారని తెలిపారు. ప్రజల కోరిక మేరకు స్పందించి ప్రహరీ గోడను కూల్చివేసిన అధికారుల తీరును కాలనీవాసులు ఈ సందర్భంగా ప్రశంసించారు. ఈ సందర్భంగా ఏసీపీ ఖుద్దుస్ మాట్లాడుతూ అపార్ట్ మెంట్లో నిర్మాణాలు నిబంధనల మేరకు ఉన్నాయో లేదో చూసి చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.