Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొత్తం రూ.30.55 లక్షలు సీజ్
వివరాలు వెల్లడించిన రాచకొండ సీపీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాచకొండ పరిధిలో హైటెక్ క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న నిందితుడిని ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.10,16,000 నగదుతోపాటు, ఐదు సెల్ఫోన్లు, 11 డెబిట్కార్డ్స్తోపాటు నాలుగు బ్యాంక్‌ల్లోని రూ.19,89,490 నగదు సీజ్ చేయించారు. మొత్తం రూ.30,55,490 విలువ ఉంటుందని సీపీ తెలిపారు. శుక్రవారం రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అదనపు సీపీ సుధీర్‌బాబుతో కలిసి రాచకొండ సీపీ మహేష్‌భగవత్ తెలిపిన వివరాల మేరకు మిర్యాలగూడకు చెందిన బి.రాజేష్ మలక్‌పేట్‌లో నివాసముంటున్నాడు. బీటెక్ పూర్తి చేసిన రాజేష్ ఉపాదికోసమని నగరానికి వచ్చాడు. బిల్డింగ్ నిర్మాణ సంస్థలో పనిచేశాడు. అయితే జల్సాలకు అలవాటైన రాజేష్‌కు వస్తున్న ఆదాయం సరిపోకపోవడంతో క్రికెట్ బెట్టింగ్‌లపై దృష్టి సారించాడు. ఈ క్రమంలో క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లతో చేతులు కలిపిన నిందితుడు క్రికెట్ బెట్టింగ్‌ల కోసం సరూర్‌నగర్‌లో ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు. కొందరు ఏజెంట్లు, భూకీలను, ఫంటర్లను ఎంపిక చేసుకొని ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నాడు. ప్రత్యేకంగా ఐడీలను సృష్టించి గత మూడేండ్లుగా గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తున్నాడు. ఫంటర్ల నుంచి డబ్బులు తీసుకుంటున్న ఏజెంట్లు గూగుల్‌పే, ఫోన్ పే తదితర పద్దతుల్లో రాజేష్‌కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అందుకుగాను వారికి 10శాతం కమీషన్ రూపంలో అందిస్తున్నాడు. ఆ తర్వాత వివిధ బ్యాంక్ అకౌంట్స్‌లోకి డబ్బులను బదిలీ చేస్తున్నాడు. దేశంలో ఎక్కడ క్రికెట్ పోటీలు జరుగుతున్నా బెట్టింగ్‌లకు పాల్పడుతున్నాడు. ఇరు జట్లమధ్య క్రికెట్ మ్యాచ్‌లు మొదలైనప్పటి నుంచి చివరి బంతి వరకు బాల్‌బాల్‌కు ఆన్లైన్లో బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్ మ్యాచ్‌లపై బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్టు సమాచారం అందుకున్న ఎస్వోటీ పోలీసులు సరూర్‌నగర్ పోలీసులతో కలిసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడే 'ఫేర్రర్ లైన్ చానల్'కు రాజేష్ హైదరాబాద్ సిటీ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నాడని సీపీ తెలిపారు. క్రికెట్ బెట్టింగ్‌లపై ప్రత్యేక నిఘా వేశామాన్నారు. ఈ సమావేశంలో డీసీపీ జే.సురేందర్‌రెడ్డి, ఇన్స్పెక్టర్లు టి.రవికుమార్, ఏ.సీతారాం, ఏ.ఏ.రాజుతోపాటు తదితరులు పాల్గొన్నారు.