Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖైరతాబాద్ జోనల్కమిషనర్కు దేవరకొండ బస్తీవాసుల వినతి
నవతెలంగాణ-బంజారాహిల్స్
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 5, దేవరకొండ బస్తీ సమీపంలోని పంజాగుట్ట శ్మశాన వాటికలో కరోనా శవాలను దహనం చేస్తుండటంతో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని దేవరకొండ బస్తీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ప్రావీణ్యను కలిసి తమ బాధను చెప్పుకున్నారు. ఇక్కడ శవాలను దహనం చేస్తుండటంతో చుట్టు పక్కల బస్తీలకు వాసన వస్తోందని, దట్టమైన పొగలు వ్యాపిస్తున్నాయని, ఇబ్బందికర వాతావరణంతో అవస్థలు పడుతున్నామని తెలిపారు. పరిస్థితి ఇట్లుంటే తాము ఎలా బయటకు రావాలో చెప్పాలని కోరారు. గతంలో రోజూ ఒకటి నుంచి ఐదు వరకు మృతదేహాలను కాల్చేవారని, బుధవారం నుంచి రోజూ 40 వరకు ఇక్కడే దహనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడికి కొవిడ్ తో మృతి చెందిన వారిని తీసుకొస్తుండటంతో తమకు కరోనా సోకే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇక్కడ మృతదేహాలను దహనం చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.
ఒక్క దహనానికి రూ. 25 వేలు
కొవిడ్‌తో చనిపోతున్న వారిని ఇండ్లకు తీసుకుపోలేని పరిస్థితి, శవాలను తీసుకెళ్తే ఎక్కడ కరోనా వ్యాపిస్తుందోననే భయం ప్రజల్లో నెలకొంది. దీంతో కరోనాతో చనిపోయిన శవాల దహనానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆ పనిచేస్తున్న శ్మశాన వాటికల నిర్వాహకులకు డిమాండ్ పెరిగింది. శవ దహనం, శ్మశానికి తీసుకెళ్లేందుకు అంబులెన్సు వంటి ఖర్చులు కలిపి రూ. 25 వేల వరకు దహన సంస్కారాలకు వసూలు చేస్తున్నారు.