Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
కరోనావైరస్ ఏ స్థాయిలో విజభిస్తుందో అందరికీ తెలుసు. ఇలాంటి సమయంలో మరింత జాగ్రత్తగా ఉండకపోతే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఢిల్లీ నగరంలో ఆక్సిజన్ కొరతతో అక్కడి ప్రజలు ప్రాణాలు వదులుతున్నారు. అయితే మనం తీసుకునే జాగ్రత్తలే మన ప్రాణాలకు భరోసా ఇస్తాయని వైద్యులు చెబుతున్నారు. కరోనా వైరస్ వ్యాధి పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని, లేని వారికి అవగాహన కల్పించాలని చెబుతున్నారు.
వెంటనే వైద్యుడిని సంప్రదించాలి : కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కోవిడ్ టెస్టు చేయించుకోవాలి. జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, తలనొప్పి, ఒంటినొప్పులు, వాసన, రుచి తెలియకపోవడం వంటి లక్షణాలు. పల్స్ ఆక్సిమీటర్‌తో ఆక్సిజన్ లెవెల్స్‌ను చెక్ చేసుకోవాలి. మీరు మీ కుటుంబ సభ్యులు మాస్కులు ధరించాల్సి ఉంటుంది. వెంటిలేషన్ కోసం ఇంట్లో కిటికీలు తెరిచి ఉంచండి. నిత్యం పానీయాలు తీసుకోండి. జ్వరం వస్తే పారాసిటమాల్ మాత్రలు దగ్గర ఉంచుకోండి. అసలు కరోనా లక్షణం ఒక్కటి కనిపించినా చాలు వెంటనే ఐసొలేట్ అవ్వండని డాక్టర్ సీమా రెహమాన్, బంజారాహిల్స్ ప్రాథమిక ప్రధాన వైద్యులు, సౌకత్ నగర్ ప్రధాన వైద్యులు వెంకట్రామన్ చెబుతున్నారు. పల్స్ ఆక్సిమీటర్‌తో మీ ఆక్సిజన్ లెవెల్స్ తెలుసుకోవచ్చు. మీ ఎడమ చేతి మధ్య వేలుకు ఈ ఆక్సిమీటర్ ఉంచితే 45వ సెకనులో వచ్చే రీడింగ్ కరెక్ట్ రీడింగ్ అని చెబుతున్నారు. 92 కంటే తక్కువగా రీడింగ్ చూపిస్తే ఆక్సిజన్ అవసరమని గుర్తించాలి. సాధారణంగా 95 కంటే ఎక్కువగా రీడింగ్ చూపించాలి. ఒత్తిడి మానసిక ఇబ్బందుల నుండి మొదట జయించాలని వైద్య నిపుణులు ప్రజలకు సూచిస్తున్నారు. కొందరు వ్యాధి లక్షణాలు లేకుండా చిన్న పిల్లలను సైతం టెస్టులకు ఆస్పత్రులకు పంపించి రోజంతా గంటలతరబడి వద్దన్నా వినకుండా గుంపులు గుంపులుగా ఉంటున్నారని, ఈ విషయమై బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందించగా ప్రత్యేకంగా సిబ్బందిని నియమించడంతో లోపలికి రాకుండా సిబ్బంది వ్యవహరించినా రహదారులపై సమూహాలుగా ఉంటూ కరోనా కట్టడి చేయడంలో ప్రజలు జవాబుదారీగా వ్యవహరించడం లేదని వైద్య సిబ్బంది పలుమార్లు తెలిపినా వారు బేఖాతరు చేస్తూ ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ, తమ అనుమానాలను ఇతరులకు తెలియజేస్తూ వారి ఇబ్బందులు ఇతరులకు ఇబ్బందికరంగా మారుతాయని తెలుసుకోలేకపోతున్నారన్నారు. వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నా వినకుండా పదే పదే ఆసుపత్రుల చుట్టూ తిరిగి అనారోగ్యాల బారిన పడుతున్నారని తెలియజేస్తున్నారు.