Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో అక్రమంగా విక్రయాలు
- ముగ్గురు అరెస్టు , ఏడు ఇంజక్షన్ల స్వాధీనం
నవతెలంగాణ-సిటీబ్యూరో
గుట్టుచప్పుడు కాకుండా బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు రెమిడెసివిర్ ఇంజక్షన్లను విక్రయిస్తున్న నిందితులను సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు వేర్వేరుగా అరెస్టు చేశారు. సైబరాబాద్ పరిధిలో ఇంజక్షన్లు విక్రయిస్తున్న ఇద్దరిని ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి మూడు ఇంజక్షన్లతోపాటు రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాచకొండ సీపీ మహేష్‌భగవత్ తెలిపిన వివరాల మేరకు... ప్రకాశం జిల్లాకు చెందిన కె.దిలీప్ వనస్థలిపురంలో ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. సూర్యాపేటకు చెందిన వి.మధు సరూర్‌నగర్‌లో నివాసముంటూ ల్యాబ్ టెక్నిషీయన్‌గా పనిచేస్తున్నాడు. మార్కెట్లో రెమిడెసివిర్ ఇంజక్షన్‌కు భారీ డిమాండ్ ఉండడంతో అధిక ధరలకు విక్రయించాలని పథకం వేశారు. ప్రదీప్ అనే మరో వ్యక్తితో కలిసి ఒక ముఠాగా ఏర్పాడ్డారు. రెమిడెసివిర్ అవసరమైన వారికి రూ.30వేలకు విక్రయిస్తున్నారు. నాగోల్ మెట్రోస్టేషన్ వద్ద ఇంజక్షన్లను ఇతరులకు విక్రయిస్తున్నట్టు సమాచారం అందుకున్న ఉప్పల్ పోలీసులు ప్రత్యేక నిఘా వేశారు. ఏసీపీ ఎన్.శ్యామ్‌ప్రసాద్ రావు ఆదేశాలతో ఉప్పల్, మేడిపల్లి, మల్కాజ్గిరి ఎస్వోటీ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ప్రదీప్ కోసం గాలిస్తున్నామని సీపీ తెలిపారు.
రాచకొండ పరిధిలో...
కరోనా బారిన పడిన వారికి అత్యావసరంగా ఉపయోగిస్తున్న రెమిడెసివిర్ ఇంజక్షన్లు యథేచ్ఛగా బ్లాక్ మార్కెటింగ్‌కు తరలుతున్నాయి. పోలీసులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యల తీసుకున్నా అక్రమార్కులు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. తాజాగా మరో నిందితుడిని ఈస్ట్‌జోన్ టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని నుంచి 100ఎంజీ సామర్త్యం గల నాలుగు ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం అదనపు డీసీపీ జి.చక్రవర్తి తెలిపిన వివరాల మేరకు నింబోలీఅడ్డకు చెందిన బి.శ్రీహరీ కాచిగూడలో 'సుమా ఫార్మసీ' పేరుతో ఫార్మాస్యూటికల్ వ్యాపారం చేస్తున్నాడు. అయితే మార్కెట్లో రెమిడెసివిర్ ఇంజక్షన్లకు భారీగా డిమాండ్ ఉండడంతో అక్రమంగా నిల్వచేసి, అధిక ధరలకు విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో రెమిడెసివిర్ ఇంజక్షన్లను సప్లరు చేసే వినేరు అనే యువకునితో చేతులుకలిపాడు. ఇద్దరు కలిసి ఇంజెక్షన్లు అవసరమైన వారికి రూ.30వేలకు విక్రయిస్తున్నారు. కాచిగూడలో శ్రీహరివు ఉన్నట్టు సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కోసం కాచిగూడ పోలీసులకు అప్పగించినట్టు ఆయన తెలిపారు.