Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆన్లైన్లో బుక్ చేసుకున్నవారికే ఇస్తున్నరు
- సమాచారంలేక సెంటర్‌వద్ద బాధితుల ఎదురుచూపు
- వైద్యసిబ్బందిపై ఆగ్రహం
నవతెలంగాణ-ఉప్పల్/ఓయూ
తమకు కొవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలంటూ వివిధ ప్రాంతాల నుంచి రామంతపూర్ హౌమియోపతి ఆస్పత్రివద్దగల వ్యాక్సినేషన్ సెంటర్ దగ్గరకు వచ్చిన బాధితులు ఆందోళనకు దిగారు. తాము ఉదయం నుంచి పడిగాపులు కాసినా ఆస్పత్రి సిబ్బంది వ్యాక్సిన్ లేదంటున్నారని, తమకు కొవిడ్ టీకా ఎందుకివ్వరని ప్రశ్నించారు. డాక్టర్లను సంప్రదించగా ప్రస్తుతం ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఇస్తున్నామని, స్లాట్ బుక్ చేసుకుని డేట్, టైమింగ్ కేటాయించబడిన వారికి మాత్రమే ఇస్తున్నామని తెలిపారు. ఈ విషయం తాము క్యూలో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదని వ్యాక్సిన్ కోసం వచ్చినవారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్లాట్ బుక్ చేసుకున్న వారికే: డాక్టర్ రమేశ్
ఇక నుంచి ఆన్లైన్లో స్లాట్ బుక్‌చేసుకున్న వారికే వ్యాక్సిన్ ఇస్తామని, అది కూడా ప్రస్తుతానికి 45 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమేనని లాలపేట్ యూపీహెచ్సీ డా.రమేశ్ తెలిపారు. తమ ఆస్పత్రిలో ఇక నుంచి రోజూ 60 నుంచి 80 మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తామని చెప్పారు. స్లాట్ బుక్ చేసుకున్నవారు కూడా తమకు కేటాయించిన సమయంలో మాత్రమే రావాలని సూచించారు. కొవిడ్ టెస్టులు మాత్రం యథావిధిగా నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం రెండవడోస్ వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. కరోనా పరిస్థితులను బట్టి చూస్తే ఈ ఆన్లైన్ విధానం ఒక రకంగా మంచిదే అయినా ఇది డాక్టర్స్‌కు ఆరోగ్య సిబ్బందికి, పేషెంట్లకు రిస్కు తక్కువగా ఉంటుంది. కానీ నిరక్షరాస్యులకే కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. తాము ఆన్లైన్ ఎలా బుక్ చేసుకోవాలని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నుంచిలాలపేట్ పరిధిలోని రెండు ఆస్పత్రుల్లో, మెట్టుగూడ, అడ్డగుట్ట ఆస్పత్రుల్లో ఆన్లైన్లో స్లాట్‌బుక్ చేసుకున్నవారికి వ్యాక్సిన్ ఇచ్చారు.