Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవలం నాలుగు గంటలే సడలింపు
- రద్దీగా మారిన బస్టాండ్లు
- కాలినడకన ఇండ్లకు ఉద్యోగులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఒక్కసారిగా లాక్డౌన్ విధించడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. 10రోజలపాటు లాక్డౌన్ అమల్లో ఉండనుంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు (నాలుగు గంటలు) కార్యకలాపాలకు అనుమతులివ్వడంతో నగర వాసులకు ఇబ్బందులు తప్పలేదు. నిత్యావసర సరుకులు కొనేందుకు ఉదయం పెద్దఎత్తున రోడ్లుపైకి వచ్చారు. కేవలం నాలుగు గంటల సమయమే ఉండడంతో కిరాణాం దుకాణాలు, సూపర్ మార్కెట్ల వద్ద నిత్యావసరాల కోసం క్యూ కట్టారు. దాంతో మార్కెట్లు కిటకిటలాడాయి. రోడ్లపై వాహనాలను బారులు తీరడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
సొంతూళ్లకు వెళ్లలేక...
బుధవారం కూడా పొద్దున్న ప్రారంభమయ్యే బస్సుల్లో సొంతూళ్లకు పయనమయ్యారు. ఉదయంపూట సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లతోపాటు మహాత్మాగాంధీ, జూబ్లీ, ఉప్పల్ బస్టాండ్లలో రద్దీ కనిపించింది. పదిగంటల తర్వాత నిర్మానుష్యంగా మారాయి. ఉదయం 10గంటల వరకు మాత్రమే అనుమతులు ఉండటంతో ప్రయాణికులకు అవస్థలు తప్పలేదు. ఒక్కోబస్సులో కెపాసిటీని మించి ప్రయాణించారు. ఇదిలావుండగా ఇతర రాష్ట్రాల బస్సులకు అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఇక బస్టాండ్‌కు వెళ్లిన వారు బస్సులు లేకపోవడంతో కొందరు ఎలాగోలా ప్రైవేట్ వాహనాల్లో సొంతూళ్లకు వెళ్లారు. మరికొందరు బస్టాండ్‌లోనే వేచి ఉండాల్సి వచ్చింది. ఇంకొందరు తిరిగి ఇంటికి వెళ్లాలన్నా కష్టాంగానే మారింది. తిరుగు ప్రయాణానికి బస్సులు, ఆటోలు లేకపోవడంతో కొందరు కాలినడకన ఇండ్లకు వెళ్లిపోయారు. ఇదే అదునుగా ప్రైవేట్ వాహనదారులు వేలాది రూపాయలను దండుకున్నారు.
లిఫ్ట్ అడిగి వెళ్లిన ఉద్యోగులు
ప్రభుత్వం, ప్రయివేట్ సంస్థలతోపాటు బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే లాక్‌డౌన్‌తో రవాణా వ్యవస్థపూర్తిగా స్తంభించడంతో ట్యాక్సీలు, ఆటోలు సైతం రోడ్లపైకి రాలేదు. ఉదయం కొందరు సొంత వాహనాలపై కార్యాలయాలకు వెళ్లారు. మరికొందరు ఎలాగోలా ఉదయం సంస్థలకు చేరుకున్నారు. అయితే సాయంత్రం కార్యాలయాల నుంచి తిరిగి ఇంటికెళ్తామంటే ఇబ్బందులు తప్పలేదు. ట్యాక్సీలు, ఆర్టీసీ బస్సులు, ఆటోలు రోడ్లపై లేకపోవడంతో వాహనాలు నడిపించలేని వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇంటి నుంచి ఏవరినైనా పిలిపించుకుందామంటే పోలీసులు కేసులు నమోదు చేస్తారేమోనని వెనుకంజ వేశారు. కొందరు ఉద్యోగులు కాలినడకన ఇంటి దారి పట్టగా, మరికొందరు ఉద్యోగులు అటుగా వెళ్తున్న వారిని లిఫ్ట్ అడిగి వెళ్లారు. కొందరు లిఫ్ట్‌లు ఇచ్చేందుకు సాహసం చేసినా మరికొందరు లిఫ్ట్ ఇవ్వడానికి వెనుకడుగేశారు.ఝ