Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
కరోనా, లాక్డౌన్ వేళ నిత్యావసర వస్తువుల దుకాణాలు, మెడికల్, మాల్స్, అయిల్ షాపుల వ్యాపారులు అధిక ధరల పేరుతో వినియోగదారులను దోచుకుంటున్నారు. ఇలా ప్రజల నుంచి ఇష్టానుసారంగా ఎంఆర్పీ ధరల కన్నా అధిక ధరలు వసూలు చేస్తున్న వారిపై జిల్లావ్యాప్తంగా నాలుగు శాఖలు సంయుక్త బృందాలుగా ఏర్పడి మూడు రోజులుగా దాడులు నిర్వహిస్తున్నారు. అధిక రేట్లు, ఎంఆర్పీ, వస్తువుల తయారీ, ఎక్స్పైరీ తేదీ, నాసిక రకం సరుకుల అమ్మకం, స్టాక్ బోర్డు లేకపోవడం, నకిలీ బిల్లుల జారీ వంటివి ఫిర్యాదులు అధికారుల దృష్టికి రావడంతో తనిఖీలు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు 67 దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి..18 కేసులు నమోదు చేశారు. సమారు రూ.65వేల ఫెనాల్టీ విధించారు. కాగా లాక్డౌన్ కొనసాగే వరకు ఈ తనిఖీలు కొనసాగుతాయని, ఎంఆర్పీ కన్నా అధిక ధరలు వసూలు చేసే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
'అడ్డగోలు' దోపిడీ
లాక్డౌన్ విధించడం, మరోవైపు రాష్ట్రంలో కరోనా ఉధృతితో కేసులు పెరుగుతుండడంతో ప్రజలు ఆర్యోగంపై ప్రత్యేక దృష్టిసారించారు. దీనికితోడు ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో అరకొర వైద్యం, వసతుల దెబ్బకు ప్రజలు సొంత వైద్యానికి మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో చిన్నచితకా జబ్బులైన జలుబు, జ్వరం, తలనొప్పి వంటివి నయం కోసం మెడికల్ షాపులకు స్వయంగా వెళ్లి మందులు తెచ్చుకుని వేసుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా స్వల్ప లక్షణాలు ఉంటే చాలు అవి కోవిడ్ లక్షణాలుగా భావించి ఆస్పత్రులకు వెళ్లడంతో వారు రాసిచ్చిన మందులు కొనుగోలు చేయడం, అలాగే బలమైన ఆహారం కోసం మునుపెన్నడూ లేనివిధంగా వేల రూపాయిలు వెచ్చించి నిత్యావసర సరుకులు కొనుగోలు చేస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని నిత్యావసర వస్తువుల దుకాణాదారులు, సూపర్మార్కెట్లు, మాల్స్, అయిల్ షాపులు, చికెన్, మటన్ దుకాణాదారులు, మెడికల్ షాపుల నిర్వాహకులు ఎంఆర్పీ కంటే అడ్డగోలుగా ధరలు పెంచి సామాన్యుల జేబులు గుల్లచేస్తున్నారు. వీటిపై వినియోగదారుల నుంచి అధికారులకు వరుస ఫిర్యాదులు అందుతుండడంతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో గడిచిన మూడు రోజులుగా పౌరసరఫరాల, తూనికలు, కొలతలు, ఫుడ్స్, డ్రగ్స్ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక సంయుక్త బృందాలు రంగంలోకి దిగాయి. ఇద్దరు పౌరసరఫరా సహాయ అధికారులు, లీగల్ మెట్రాలజీ డ్రగ్స్, ఫుడ్స్ శాఖల నుంచి ఒక్కొ ఇన్స్పెక్టర్తో కూడిన బృందాలు ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
67 దుకాణాల్లో తనిఖీలు..18 కేసులు నమోదు
నగరంలోని కిరాణా, మెడికల్, మాల్స్‌తోపాటు కూరగాయల మార్కెట్లు, హోటళ్లతో వరుస దాడులు కొనసాగుతున్నాయి. పౌరసరఫరాల, తూనికలు, కొలతలు, ఫుడ్స్, డ్రగ్స్ నాలుగు శాఖల అధ్వర్యంలో ఏర్పడిన బృందాలు శుక్ర, శని, అదివారాల్లో తనిఖీలు నిర్వహించాయి. అదివారం నగరంలోని హిమాయత్‌నగర్ మండే మార్కెట్, మలక్‌పేట్ గంజ్, మినర్వా, ప్యారడైజ్ హోటల్, అగ్రా స్వీట్స్, డీమార్ట్, బడా హోల్‌సేల్ షాపులు, చికెన్, మటన్ దుకాణాలు దాడులు నిర్వహించాయి. నాలుగు బృందాలు 35 తనిఖీలు చేపట్టాయి. ఒక సూపర్ మార్కెట్, మూడు హోటళ్లు, పది మెడికల్ షాపులు, 3 కూరగాయల మార్కెట్, ఒక చికెన్ షాపు, 5 స్విట్ షాపులు, 12 అయిల్ షాపులపై దాడులు చేసి 8 కేసులు నమోదు చేశాయి. ఈ బృందాలు ఇప్పటివరకు 67 వివిధ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి 18 కేసులు నమోదు చేసి 65వేల ఫెనాల్టీ విధించాయి.
ఫిర్యాదులపై ప్రత్యేక కంట్రోల్ రూమ్ : డీఎస్వో రమేష్
అధిక ధరల కట్టడితో పాటు కల్తీ సరుకులు అంటగట్టే వ్యాపారులపై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు పౌరసరఫరా శాఖ హైదరాబాద్ సీఆర్వో ఆఫీసులో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశాం. నిత్యావసర వస్తువులపై ఇష్టానుసారం ధరలు వసూలు చేసేవారిపై ఫిర్యాదు చేసిన వెంటనే చర్యలు తీసుకుంటాం. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు వస్తువులు విక్రయించే వారిపై కోరడా ఝలిపిస్తాం. ఇప్పటివరకు 60-70 ఫాపుల్లో తనిఖీలు చేపట్టి..18 కేసులు నమోదు చేసి రూ.65వేల ఫెనాల్టీ విధించాం. లాక్డౌన్ కొనసాగే వరకు ఈ దాడులు నిర్వహిస్తాం.