Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెస్టులు పెంచి వాస్తవ లెక్కలు ప్రకటించాలి: సీపీఐ(ఎం)
నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కేసులకు సంబంధించి అదివారం విడుదల చేసిన ప్రకటనలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ నెల 15న 657 కేసులు నమోదైనట్టు ప్రకటించిందని, ఇది అవాస్తవమైన సంఖ్య అని సీపీఐ(ఎం) పార్టీ మండిపడింది. ఈ మేరకు అదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా టెస్టులు భారీగా తగ్గించిన కారణంగా కేసులు తగ్గినప్పటికీ వాస్తవ లెక్కలను సర్కారు వెల్లడించకపోవడం దారుణమని సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ మండిపడ్డారు. ప్రయివేటు పరీక్షా కేంద్రాల్లో నమోదైన కేసుల వివరాలు, ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నమోదైన కేసుల వివరాలను ప్రభుత్వం ప్రకటించడం లేదని, ఇవి కాకుండా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రుల్లో నమోదైన లెక్కలనూ తగ్గించి చూపించడం సరైనది కాదని విమర్శించారు. కిందిస్థాయి వైద్య అధికారులు ప్రకటించిన వివరాల ప్రకారం శనివారం రోజు గ్రేటర్ హైదరాబాద్లోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో 5వేల టెస్టులు జరగ్గా.. 800 కేసులు నమోదయ్యాయని, ప్రయివేటు పరీక్షలు, ఆర్టీపీసీఆర్ టెస్టులు వేల సంఖ్యలో జరుగు తున్నప్పటికీ ఆ వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయడం లేదన్నారు. వాస్తవానికి ఆ లెక్కలను కలుపుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంఖ్యకు రెట్టింపు ఉండే అవకాశం ఉందన్నారు. టెస్టులు పెంచాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించినప్పటికీ భారీగా తగ్గించి, కేసులను తక్కువ చూపిస్తున్నారని పేర్కొన్నారు. రోజువారీ టెస్టులను పెంచాలని కరోనా కేసుల వాస్తవ లెక్కలనే ప్రకటించాలని, వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని సీపీఐ(ఎం) తరపున ఆయన డిమాండ్ చేశారు.