Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెండింగ్ వేతనాలు చెల్లించాలి: ఐఎఫ్టీయూ
ఓయూ అడ్మిస్ట్రేషన్ బిల్డింగ్ ఎదుట ధర్నా
నవతెలంగాణ-ఓయూ
ఓయూలో పనిచేస్తున్న 357 మంది హాస్టల్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను తక్షణమే చెల్లించాలని, కాంట్రాక్ట్ టెండర్ రెన్యూవల్ చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్ఎల్ పద్మ డిమాండ్ చేశారు. లాక్డౌన్ కాలంలో కార్మికులకు అనుకూలంగా ప్రభుత్వం ఇచ్చిన జీవోను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఓయూ పరిపాలనా భవనం ఎదుట ప్రొగ్రెసివ్ కాంట్రాక్ట్ అండ్ క్యాజువల్ వర్కర్స్ (ఐఎఫ్టీయూ అనుబంధం) ఆధ్వర్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిరసన, ధర్నా చేపట్టారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షురాలు పద్మ మాట్లాడుతూ 20 ఏండ్లుగా యూనివర్సిటీ హాస్టల్స్‌లో సేవ చేస్తున్న వారికి లాక్డౌన్ కాలంలో జీతాలు చెల్లించకుండా వివక్ష పూరితంగా వ్యవహరించడం అన్యాయమన్నారు. వందలాది మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులు యూనివర్సిటీలో ఉండగా కేవలం 357 మందికి జీతాలు చెల్లింపులో జాప్యమెందుకని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ జీవో నెంబర్ 102 ప్రకారం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లించకపోతే ఆ యాజమాన్యాలు శిక్షార్హులు అవుతాయని, హాస్టల్ మెస్ వర్కర్స్ కూడా ఈ జీవో వర్తిస్తుందని గుర్తుచేశారు. లాక్డౌన్ ప్రకటనతో వేతన జీవులు, చిరు ఉద్యోగుల జీవితాలు అగాధంలోకి పడ్డాయని, ఇలాంటి సమయంలో ప్రభుత్వం వీరిని పెద్ద మనసుతో ఆదుకోవాలని కోరారు. తక్షణమే ఓయూ మెస్ వర్కర్ల ఏప్రిల్ నెల వేతనాలు చెల్లించాలని, కాంట్రాక్టు టెండర్‌ను రెన్యూవల్ చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ తరఫున ధర్నా వద్దకు చేరుకున్న ఓయూ చీఫ్ వార్డెన్ కొర్రెముల శ్రీనివాస్ మాట్లాడుతూ ఏప్రిల్ నెల జీతాలను విడుదల చేస్తామని, కాంట్రాక్ట్ టెండర్ రెన్యూవల్ కోసం కమిటీని ఏర్పాటు చేసి అంతర్గతంగా కూడా చర్చించి అనుకూలమైన నిర్ణయం తీసుకోడానికి కషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ నాగేశ్వరరావు, ప్రగతిశీల యువజన సంఘం(పీవైఎల్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఎస్ ప్రదీప్ ధర్నాలో పాల్గొని ఓయూ హాస్టల్ ఔట్‌సోర్సిగ్ ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో ఓయూ ఐఎఫ్టీయూ నేతలు కౌసర్, భారతి, శివ, లక్ష్మి, ప్రకాష్, జయ, అనసూయ, కవిత, వెంకటేష్, రహమత్, లలిత, వరలక్ష్మి, విజయ, స్వప్న, సుల్తానా, ప్రవీణ్, వాణి, పద్మ, శ్యామల, లత, స్రవంతి పాల్గొన్నారు.