Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీఐటీయూ జూబ్లీహిల్స్ జోన్ కమిటీ డిమాండ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
కరోనా రెండో దశ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలని, వెల్ఫేర్ బోర్డులో పేరు నమోదు చేసుకున్న కార్మికులందరికీ కరోనా తగ్గుముఖం పట్టే వరకు రూ.10వేల ఆర్థిక సహాయం అందించాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. మంగళవారం సీఐటీయూ జూబ్లీహిల్స్ జోన్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్పీఆర్ హిల్స్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జోన్ కన్వీనర్ జే.స్వామి మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్, లాక్డౌన్ కారణంగా భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేక ఇంటి అద్దెలు కట్టలేక కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. ఈ కష్టకాలంలో ప్రభుత్వాలు వారిని ఆదుకోని భరోసా కల్పించాల్సిన బాధ్యత ఉందని ఆయన సూచించారు. కరోనా నేపథ్యంలో కార్మికులకు, ప్రజలకు నిత్యావసర సరుకుల్ని ఇంటి వద్దకే అందించాలన్నారు. జిల్లాలో వేల్ఫేర్ బోర్డులో ఉన్న పెండింగ్ క్లెయిమ్స్‌కు వెంటనే నిధులు విడుదల చేయాలన్నారు. కరోనా భారిన పడిన భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు తక్షణమే రూ.50వేల ఆర్థిక సహాయం అందించాలని, కరోనాతో చనిపోయిన ఆ కుటుంబాలకు రూ పది లక్షల చొప్పున ప్రమాద బీమా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వలస కార్మికులకు రక్షణ కల్పించాలన్నారు. కరోనా టెస్టులు మొబైల్ వాహనం ద్వారా ప్రజలందరికీ నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఏ.ఆర్. నరసింహా, టి. భాగ్యరాజు, బి.లక్ష్మణ్, బి.బాలయ్య, విజరు, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.