Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ హైదరాబాద్ నగర కార్యదర్శి టి.మహేందర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రయివేటు, కార్పొరేట్ హాస్పిటళ్ల దోపీడీని ప్రభుత్వం వెంటనే అరికట్టాలని డీవైఎఫ్ఐ నగర కార్యదర్శి టి. మహేందర్ డిమాండ్ చేశారు. గురువారం డీవైఎఫ్ఐ హైదరాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంవద్ద కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా టి.మహేందర్ మాట్లాడుతూ.. ఓవైపు కరోనా జనజీవితాలను అస్తవ్యస్తం చేస్తుంటే.. కార్పొరేట్ ఆస్పత్రుల్లో కరోనా బాధితుల నుంచి లక్షల్లో ఫీజులు గుంజుతూ వాటి యాజమాన్యాలు జలగల్లా పీక్కు తింటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో రేట్లను ప్రభుత్వం నియంరతించాలని కోరారు. కరోనా కష్టకాలంలో ప్రజల పక్షాన ఉండాల్సిన సర్కారు కార్పొరేట్ ఆస్పత్రులకు వత్తాసు పలకడం సిగ్గుచేటన్నారు. కరోనా నివారణకు నిధులు పెంచకుండా బాధితులను పరామర్శించడం వల్ల ఏం లాభమని సీఎంను ఉద్దేశించి అన్నారు. ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కరోనాను పూర్తిగా నివారించే వరకైనా ప్రయివేట్, కార్పొరేట్ ఆస్పత్రులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు ఉచిత వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. కరోనా నివారణకు బడ్జెట్లో ప్రత్యేక కేటాయించాలన్నారు. ఆక్సిజన్ ఉత్పత్తులు పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్ బాబు, డీవైఎఫ్ఐ నాయకులు నవీన్, నరేష్, రాజు, సాయి, లోకేష్, రాములు, తదితరులు పాల్గొన్నారు.