Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీజీపీ ఆదేశాల నేపథ్యంలో పోలీసుల అలర్ట్
- డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా
- పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలన్న డీజీపీ ఆదేశాల మేరకు పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేశారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చేవారి వాహనాలు సీజ్‌చేశారు. జరిమానాలు విధించారు. కేసులు పెడతామని హెచ్చరించారు. ఇప్పటికే లాక్డౌన్ ప్రారంభమైన రోజు నుంచి మూడు కమిషనరేట్ల పరిధిలో రోజుకూ ఏడువేలకు పైగా వాహనాలు సీజ్ చేస్తున్నారు.
లేట్‌గా రోడ్లపైకి..
ఈ నెల 30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించిన విషయం తెలిసిందే. నిత్యావసర వస్తువులు, ఇతర అవసరాల కోసం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సడలింపు ఉంది. కానీ చాలామంది ప్రజలు ఉదయం 6 గంటలకు కాకుండా 8 గంటల తర్వాత పెద్దఎత్తున రోడ్లపైకి వస్తుండటంతో రద్దీగా మారుతున్నాయి. దాంతో ఉప్పల్, అంబర్పేట్, కోఠి, లిబర్టీ, హిమాయత్‌నగర్, జూబ్లీహిల్స్, మాదాపూర్, మెహిదీపట్నం, టోలీచౌక్, మలక్‌పేట్, దిల్సుఖ్నగర్, సైదాబాద్తోపాటు పాతబస్తీ, సికింద్రాబాద్, తార్నాకా, విద్యానగర్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మెయిన్‌రోడ్లు, చౌరస్తాల్లో కార్లు, బైకులు బారులు తీరుతున్నాయి.
వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్
ముఖ్యంగా రిలాక్సేషన్ తరువాత కూడా అనుమతి లేకుండా వాహనాలపై కొందరు రోడ్లు పైకి వస్తుండటంతో పోలీసులు చర్యలను మరింత కఠినతరం చేశారు. డ్రోన్ కెమెరాలతో వాహనాలపై వెళ్తున్నవారిని, నిబంధనలు ఉల్లంఘిచిన వారిని గుర్తిస్తున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులవద్ద వాహనాలను నిలిపి ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి కారణాలూ లేకుండా రోడ్లపైకి వస్తున్న వారి వాహనాలను సీజ్ చేస్తున్నారు. నాలుగు గంటల సడలింపుతో రోడ్లపైకి విచ్చల విడిగా వందలాది వాహనాలు రావడంతో బేగంపేట్, షేక్‌పేట్, టోలీచౌకీ తదితర ప్రాంతాల్లో గురువారం కూడా భారీగా ట్రాఫిక్ జామైంది.షేక్‌పేట్-మెహదీపట్నం వరకు ట్రాఫిక్ జామైంది. బేగంపేట్‌లో కూడా రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో అంబులెన్స్‌లు కూడా చిక్కుకుపోయాయి.