Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్లచట్టాలను రద్దుచేసేదాకా తమ పోరాటం ఆగదని వివిధ సంఘాలు పేర్కొన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీఐటీయూ, ఐద్వా, ఎస్ఎఫ్ఐ, కేవీపీఎస్, డీవైఎఫ్ఐ తదితర సంఘాల ఆధ్వర్యంలో బుధవారం నగరవ్యాప్తంగా నిర్వహించిన బ్లాక్ డే కార్యక్రమం విజయవంతమైంది. ఈసందర్భంగా వివిధ డిమాండ్లతో ఉన్న ప్లకార్డ్స్, నల్లబ్యాడ్జీలు, నల్లజెండాలతో నిరసన తెలియజేశారు.
నవతెలంగాణ-ఎల్బీనగర్/హయత్‌నగర్
రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం ఎల్బీనగర్ ఆటోనగర్ జంక్షన్ వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కేసరి నర్సిరెడ్డి మాట్లాడుతూ గత ఆరు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతు వ్యతిరేక, విద్యుత్ సవరణ బిల్లులను రద్దుచేయాలని డిమాండ్ చేస్తున్నా వాటిని పరిష్కరించకుండా కేంద్రప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. డీజిల్, పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి పేద, మధ్య తరగతి ప్రజలపైన పెనుభారం వేస్తున్నారని విమర్శించారు. లాక్డౌన్ కాలంలో ప్రతి కుటుంబానికి రూ.7500 నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రయివేట్ ఆస్పత్రులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, అక్రమ వసూళ్లు నిలుపుదల చేసి ప్రజలను ఆదుకోవాలని కోరారు. రైతులకు మద్దతు ధర ఎత్తివేయడంతో ప్రయివేట్ వ్యాపారస్తులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే రైతుల సమస్యలను పరిష్కరించి, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు పూదరి రమేష్, ముద్ద శంకర్, లోయపల్లి జనార్దన్, శంకర్ గౌడ్, నక్క యాదయ్య, బి స్వామి, భాస్కర్ నాయక్, హనుమానాయక్, సాయిలు పాల్గొన్నారు.
ఓయూ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వివిధ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం సికింద్రాబాద్ నియోజవర్గంలో బ్లాక్ డే నిర్వహించారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, దేశ ప్రజలందరికీ టీకాను ఉచితంగా ఇవ్వాలని, ఆక్సిజన్, బెడ్స్, ఆరోగ్య వసతులను మెరుగుపరచాలని సికింద్రాబాద్ సీపీఐ(ఎం) కార్యదర్శి అజరు బాబు కోరారు. కేరళ మాదిరిగా 16 రకాల నిత్యావసర సరుకులు ఇవ్వాలని మండల, గ్రామ స్థాయిలో ఐసోలేషన్ కేంద్రాలను పెంచాలని, ఫ్రంట్ లైన్ వర్కర్లకు రూ.50 లక్షలు బీమా అందించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఎం. అజరు బాబు, ఎ. బాలయ్య, ఎస్. ఆనంద్, కిరణ్ కుమార్, డి. ఆనంద్, ప్రవీణ్, నరసింహ, రాజు తదితరులు పాల్గొన్నారు.
ఏఎస్‌రావునగర్: దేశ వ్యాప్తంగా మూడు వ్యవసాయ చట్టాలు, 4 కార్మిక అనధికార కోడ్స్లను రద్దు చేయాలని, రైతు పండించిన పంటకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం ఈసీఐఎల్‌లో బ్లాక్ డే నిర్వహించారు. నరేంద్రమోదీ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఎస్. శంకర్ రావు, కార్యవర్గ సభ్యులు ప్రసాద్, జోషి కుమార్, పి. సుధాకర్, రాఘవేంద్ర రావు, గండాలు, బి. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.