Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రజలందరికి వ్యాక్సిన్ వేయిస్తామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంబీపూర్రాజు అన్నారు. శుక్రవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీహెచ్ఎంసీ జంట సర్కిళ్ల పరిధిలోని గాజులరామారం మహరాజ గార్డెన్స్, జీడిమెట్ల గ్రామం సరోజిని గార్డెన్స్, ప్రగతినగర్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూపర్ స్ప్రెడర్స్కు వ్యాక్సిన్ ఇవ్వాలని దేశంలో ఎవరికి రాని ఆలోచనను సీఎం కేసీఆర్ అమలు చేయడం సంతోషకరమన్నారు. కరోనా వైరస్ కట్టడికి సీఎం కేసీఆర్ తెలంగాణలో అనేక వ్యూహాలు అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో సుమారు 30 లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వడంతో మంచి ఫలితాలు వస్తాయన్నారు. కోటి వ్యాక్సిన్ల కోసం సీఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తున్నారని, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే నియోజకవర్గ ప్రజలందరికి వ్యాక్సిన్ వేయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వైద్య అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు, కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.