Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బాలానగర్
విద్యుత్ ఉద్యోగులు, పీసురేట్ కార్మికులను ఫ్రంట్‌లైన్ వారియర్లుగా గుర్తించి వారికి వెంటనే కోవిడ్ వ్యాక్సిన్ అందించాలని సీఐటీయూ అనుబంధ విద్యుత్ కార్మిక సంఘం తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలెక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్(టీఎస్‌యూఈఈయూ) రాష్ట్ర ఉపాధ్యక్షులు జె.ప్రసాద్ రాజు డిమాండ్ చేశారు. సీఐటీయూ జాతీయ నాయకత్వం ఇచ్చిన పిలుపులో భాగంగా ఆదివారం సికింద్రాబాద్ సర్కిల్ కార్యాలయం వద్ద పలు డిమాండ్లతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ విద్యుత్ కార్మికులు నిరసన తెలియజేశారు. ఈసందర్భంగా యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఇ. మురళి మాట్లాడుతూ విద్యుత్ సంస్థలో అనేక మంది ఉద్యోగులు కోవిడ్ బారిన పడుతున్నారని, వారికి యాజమాన్యమే ఉచితంగా వైద్యం అందించాలని కోరారు. మీటర్ రీడింగ్, అన్‌మ్యాన్ వర్కర్లకు, రెవెన్యూ వసూళ్ల కోసం ఉద్యోగులపై ఒత్తిడి లేకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్ మహమ్మారి మూలంగా చనిపోయిన వారికి కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ సర్వీసు మొత్తం కలుపుకొని గ్రాట్యుటీ చెల్లించాలన్నారు. ప్రతీ ఏరియాలో విద్యుత్ ఉద్యోగులకు ప్రత్యేక ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేసి వైద్య సిబ్బందిని నియమించాలన్నారు. పీస్ రేటు కార్మికులకు కోవిడ్ చికిత్స కోసం ప్రత్యేక క్రెడిట్ కార్డ్ సౌకర్యం, శానిటైజర్, గ్లౌవ్స్, ఫేస్ మాస్క్‌లను అందించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ రీజనల్ అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు, నాయకులు భిక్షపతి, రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.