Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నగరం నలుమూలలా జెండా ఆవిష్కరణలు
- ఘనంగా సీఐటీయూ 51వ ఆవిర్భావ దినోత్సవం
నవతెలంగాణ-సిటీబ్యూరో/ఎల్బీనగర్/మెహదీపట్నం
నగరవ్యాప్తంగా సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విస్తృతంగా జిల్లావ్యాప్తంగా కార్యాలయాల ఆవరణలో సీఐటీయూ జెండా ఎగురవేసి 51వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. గోల్కొండ చౌరస్తాలోని సీఐటీయూ నగర కార్యాలయంలో సీఐటీయూ హైదరాబాద్ సెంట్రల్ సిటీ అధ్యక్షులు కె. ఈశ్వర్ రావు జెండా ఆవిష్కరణ చేశారు. మెహిదీపట్నంలో కేక్ కట్ చేసి ఉత్సవాలు జరుపుకున్నారు. నగరం నలుమూలలా జెండా ఆవిష్కరణలు జరిగాయి. ఈ సందర్భంగా సీఐటీయూ నగర అధ్యక్ష కార్యదర్శులు కె.ఈశ్వర్ రావు, ఎం. వెంకటేష్ మాట్లాడుతూ దేశంలో ఉన్న కార్మిక వర్గాన్ని ఐక్యం చేయడం కోసం 1970 మే 30న సీఐటీయూ ఏర్పడిందని, కార్మిక హక్కుల సాధనకు ఉన్న హక్కుల పరిరక్షణ కోసం అనేక పోరాటాలు నిర్వహించిందని గుర్తుచేశారు. 1990లో దేశంలో నూతన ఆర్థిక విధానాలు ప్రారంభమయ్యాయని, ఈ నేపథ్యంలో కార్మిక చట్టాలపై పెద్దఎత్తున దాడి మొదలయ్యిందన్నారు. కార్మిక చట్టాలు, హక్కులు కాపాడుకోడం కోసం సీఐటీయూ చొరవతో 1990 నుంచి నేటి వరకు దేశంలో 20 సార్వత్రిక సమ్మెలు జరిగాయన్నారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గంపై దాడిని తీవ్రతరం చేసిందని, కార్మికులకున్న 29చట్టాలను యజమానులకు అనుకూలంగా మార్చి 4లేబర్ కోడ్లుగా చేసిందని విమర్శించారు. కార్మికలకు నష్టంచేసే 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లనే దేశంలో కరోనా విలయతాండవం చేస్తుందన్నారు. రోజుకు 4లక్షల కోవిడ్ కేసులు, 4వేల మరణాలు జరుగుతున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చునన్నారు. కనీసం కోవిడ్ రోగులకు ఆక్సిజన్, వెంటిలేటర్లు అందించలేని దుస్థితికి చేరుకుందని, ఇదేనా 'మేకిన్ ఇండియా' 'ఆత్మనిర్భర్ భారత్' అని వారు ప్రశ్నించారు. ప్రజలు కరోనాతో ఉపాధిలేక రోజు గడవని పరిస్థితి ఉంటే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలను రూ.100 చేయడం అన్యాయమన్నారు. రైల్వేలు, బ్యాంకులు, ఎల్ఐసీ తదితర ప్రభుత్వ సంస్థలను ప్రయివేటు పరం చేయడాన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. కోవిడ్ టీకా ప్రతి ఒక్కరికీ ఉచితంగా వేయాలని, ప్రతి కుటుంబానికి 6 నెలలపాటు రూ.7,500 నగదు ఇవ్వాలని, రేషన్ కార్డులపై ప్రతి ఒక్కరికి 10 కిలోల సన్న బియ్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నగర ఉపాధ్యక్షులు జె.కుమారస్వామి, వి. కామేష్ బాబు, సీనియర్ నాయకులు సుందర్, బిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమోహన్ ఆధ్వర్యంలో..
చైతన్యపురి డివిజన్ అంబేద్కర్ కాలనీ, నాంపల్లి నియోజవర్గంలో సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమోహన్ ముఖ్య అతిథిగా హాజరై సీఐటీయూ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఐటీయూ ఆవిర్భవించినప్పటి నుంచి నేటి వరకు పాలకుల ప్రజావ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలు చేస్తుందన్నారు. వివిధ కంపెనీల్లో పనిచేసే కార్మికులకు, హమాలీ, ఆటోట్రాలీ, భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు అందలేదన్నారు. లాక్డౌన్ సమయంలో ప్రజలందరికీ కేరళ మాదిరిగా 16 రకాల నిత్యావసర సరుకులు, అదేవిధంగా ప్రతి పేద కుటుంబానికి రూ.7500 అందజేయాలన్నారు. కరోనా మహమ్మారితో పోరాడి పనిచేస్తున్న కార్మికులందరికీ రూ.50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ ప్రజలందరికీ ఉచితంగా వేయాలన్నారు. ప్రయివేట్ హాస్పిటళ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆధీనంలోకి తీసుకొని ఉచిత వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే నాంపల్లి నియోజకవర్గంలో కార్మికులు కేక్‌కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో సరూర్ నగర్ సర్కిల్ సీఐటీయూ కన్వీనర్ మల్లెపాక వీరయ్య, కమిటీ సభ్యులు వెంకన్న, నాయకులు మేకల కృష్ణ, కొమ్ము నరసింహ, జి అశోక్, మేకల యాదగిరి, పి మల్లేష్, యాదయ్య, మల్లేష్, కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.