Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుర్కయాంజల్
తుర్కయాంజల్ మున్సిపాలిటీలోని వివిధ వార్డుల్లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతూ, ప్రభుత్వ రెవెన్యూ భూముల్లో సైతం అక్రమ ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్న వారిపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) నాయకులు, మున్సిపల్ బాధ్యులు డి. కిషన్ డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ షఫీ ఉల్లాకు మెమోరాండం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తుర్కయాంజల్ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున నకిలీ పర్మిషన్ల పేరుతో అక్రమ నిర్మాణాల దందా విచ్చలవిడిగా సాగుతోందన్నారు. నిబంధనల ప్రకారం గ్రామపంచాయతీల పర్మిషన్ కాలపరిమితి ముగిసి ఏడాది కాలం కావొస్తున్నా నేటికీ నకిలీ అనుమతి పత్రాలతో అక్రమ ఇండ్ల నిర్మాణాలు, వ్యాపార సముదాయాలు, బహుళ అంతస్థుల భవనాలు యథేచ్ఛగా కొనసాగడం అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో కూడిన అక్రమ దోపిడీ దందాకు నిదర్శనమన్నారు. తుర్కయాంజల్ రెవెన్యూ సర్వే నెం 212లో శ్మశాన వాటిక కోసం కేటాయించిన స్థలంతో పాటు సర్వే.నెం 52, శోభానగర్ కాబూల్ చెరువు సర్వే నెం 475 ఎఫ్టీఎల్, 279, అలాగే మన్నెగూడ సర్వే నెం 40,41, 323 లోని ప్రభుత్వ స్థలాలతో పాటు వివిధ ఎఫ్టీఎల్స్, బఫర్ జోన్స్ లాంటి ప్రభుత్వ భూముల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలు, రియల్ వ్యాపారాలపై సమగ్రమైన విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే భూఅక్రమాలపై జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా సీపీఐ(ఎం) నాయకత్వంలో పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల నాయకులు కె.అరుణ్ కుమార్, బి.శంకరయ్య, ఐ.భాస్కర్, ఎం. సత్యనారాయణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.