Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీ ఏడాది నుంచి ఐదేండ్లలోపు థెరపీ చేయిస్తే సాధారణ జీవితం
- శ్రీ కరోనా భయంతో నిర్లక్ష్యం చేయొద్దు
- శ్రీ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ ఫౌండర్, చీఫ్ స్ట్రాటజిస్ట్ శ్రీజారెడ్డి సరిపల్లి
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఆడిపాడే బాల్యం.. కల్మషం లేకుండా అందరితోనూ కలిసిపోయే చిన్నారుల సంబరం. కళ్లారా చూసి మురిసిపోని తల్లిదండ్రులు ఎవరుంటారు? కానీ ఆటిజం బాధితులయిన చిన్నారులు వాటన్నింటికీ దూరం. నలుగురితో కలవరు.. ఉత్సాహంగా, చురుగ్గా ఉండరు. ప్రవర్తనలోనూ ఇతర పిల్లలతో పోలిస్తే చాలా తేడా ఉంటుంది. కంటిచూపు సరిగా ఉండదు. ఏదీ త్వరగా నేర్చుకోలేరు. ఇలాంటి లక్షణాలతో ఉండే బిడ్డలను కన్న తల్లిదండ్రులకు ఆటిజం థెరపీ ఓ పెద్ద ఉపశమనం. నిపుణులైన వారితో థెరపీ ఇప్పిస్తే ఐదేండ్ల వయసు వచ్చేసరికి వారు కూడా మిగతా పిల్లల మాదిరిగానే అన్నింటా ముందుంటారని పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ ఫౌండర్, చీఫ్ స్ట్రాటజిస్ట్ శ్రీజారెడ్డిసరిపల్లి చెబుతున్నారు. ఐదేండ్లలోపు సరైన థెరపీ ఇప్పిస్తే ఆటిజం చిన్నారు లకు కొత్త జన్మ ఇచ్చినట్లేనన్నారు.
బిడ్డ 25శాతం మెదడుతో పుడుతుంది. ఏడాది వయసు వచ్చేసరికి అది 50 శాతానికి పెరుగుతుంది. చిన్నారికి 48 నుంచి 60 నెలల వయసు అంటే నాలుగు నుంచి ఐదేండ్ల వయసు వచ్చేసరికి పూర్తి స్థాయిలో మెదడు రూపుదిద్దు కుంటుంది. పంచేంద్రియాలు నుంచి అందే సంకేతా లను సమీకరించి మెదడుకు అందించే ఎదుగుదల బిడ్డకు 12 నుంచి 60 నెలల వయసు వచ్చేలోపు జరిగితీరాలి. బిడ్డ ప్రతి రోజూ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు తన పనులు తాను చేసు కోదగిన లైఫ్ స్కిల్స్ వారికి ఈ వయసులోనే అలవడ తాయి. అందువల్ల ఆటిజం చిన్నారులకు ఈ వయసులో కచ్చితంగా థెరపీ ఇవ్వాల్సిందే. లేకపోతే వారు జీవితాంతం ప్రతి చిన్న విషయానికి ఎవరో ఒకరి మీద ఆధారపడాల్సిన దుస్థితి కొనసాగుతుంది.
కరోనా భయంతో ఆపొద్దు
ఆటిజం అనేది 104 సంవత్సరాలుగా ఉన్న ఓ సెన్సోరియల్ డిజార్డర్. మందులేని కారణమే తెలియని వ్యాధి. ఈ లోపాన్ని పూర్తిగా తీసేయలేక పోయినా కనీసం బిడ్డ తన బతుకు తాను బతకడానికి అవసరమైన లైఫ్ స్కిల్స్ థెరపీ ద్వారా నేర్పడానికి ఈ 12 నుంచి 60 నెలల కాలమే అత్యంత కీలకం. కరోనా భయంతో ఈ గోల్డెన్ టైమును చాలా మంది మిస్సయిపోతున్నారు. ఈ బాధ చాలా మంది తల్లిదండ్రుల్లో ఉన్నా.. బిడ్డను బయటికి తీసుకొస్తే కరోనా సోకుతుందోమోననే భయం వారిని అడుగు బయటపెట్టనీయడం లేదు. 12 నుంచి 48 నెలల వయసులోపు ఆటిజం పిల్లలకు థెరపీ ఇవ్వకపోతే 17 ఏండ్ల్ల వయసు తర్వాత వారు బతికే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని థెరపీకి రావాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతేడాది లాక్డౌన్ ముగిశాక థెరపీకి వచ్చేవారి సంఖ్య 50 శాతానికి పడిపోయింది. అయితే కరోనా సెకండ్ వేవ్ వచ్చేసరికి తల్లిదండ్రులకూ ఈ వైరస్ అంత త్వరగా పోయేది కాదని అర్థమైంది. దీని కోసం పిల్లల జీవితానికి కీలకమైన థెరపీని ఆపడం సరికాదని నిపుణులు గుర్తించారు. పాక్షిక లాక్డౌన్ పెట్టేనాటికి 1600 నుంచి 1700 థెరపీ సర్వీసులు జరుగుతుండేవి. ప్రస్తుతం 1400 థెరపీలు కొనసాగుతున్నాయి.
రియల్ టైమ్ ఆడియో, వీడియో థెరపీ
1990లో పదివేల మంది పిల్లల్లో ఒకరికి ఆటిజం వచ్చేది. ఇప్పుడు ప్రతి 32 మంది చిన్నారుల్లో ఒకరు ఆటిజంతో బాధపడుతున్నారు. దేశంలో కోటీ 20 లక్షల మంది ఆటిజం బాధితులున్నారు. వీరిని బాగుచేయడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం థెరపీ మాత్రమే. పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ 25 సెంటర్లలో 370 థెరపిస్టులు ఇంటిగ్రేటెడ్ సెన్సోరియల్ థెరపీ ఇస్తున్నామని పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ ఫౌండర్ శ్రీజారెడ్డి తెలిపారు. 2021 చివరికల్లా 150 సెంటర్లు ఏర్పాటు చేయాలన్నది తమ లక్ష్యమన్నారు. పినాకిల్ అనే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌తో రియల్ టైమ్ ఆడియో, వీడియో పద్ధతుల్లో థెరపీ ఇస్తున్నామని చెప్పారు. రెండున్న రేండ్లుగా లండన్, న్యూయార్క్, బ్రిస్బేన్, కువైట్ ఇలా విదేశాల్లోని పలు ప్రాంతాల నుంచి 1.5 లక్షల థెరపీలు ఈ పద్ధతిలో ఇచ్చామని వివరించారు. కరోనా సమయంలో ఆటిజం పిల్లలను నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు.