Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికులకు బీమా సౌకర్యం కల్పించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎం చంద్రశేఖర్ కోరారు. ఈమేరకు బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్ గోపికి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మొదటి దశలో పారిశుధ్య కార్మికులను ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా ప్రకటించి రూ.50లక్షల బీమా సౌకర్యం అమలు చేశారన్నారు. రెండోదశలోనూ కార్మికులు ప్రాణాలకు తెగించి పని చేస్తున్నారని, రూ. 50 లక్షల బీమా సౌకర్యం కల్పించి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనం రూ. 19వేలు అమలు చేయాలన్నారు. గతంలో మాదిరిగా కోవిడ్ స్పెషల్ అలెవెన్స్ రూ. 5వేలు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నామంటూ, రాష్ట్ర అభివృద్ధి తమతోనే సాధ్యం అంటూ అధికారపార్టీ నాయకులు ప్రగల్భాలు పలుకుతున్నారే కానీ సామాన్య ప్రజల, కార్మికుల జీవన పరిస్థితులు ఏ మాత్రం మార్పులు గ్రహించలేక పోతున్నారనీ ఎద్దేవా చేశారు. బంగారు తెలంగాణ సాధించటం అంటే తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడటమేననీ గుర్తుచేశారు. కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ కార్యదర్శి ఎన్. ఎల్లమ్మ, ఉపాధ్యక్షులు పి.పెంటయ్య, కమిటీ సభ్యులు సత్యనారాయణ, బాలస్వామి, బి నరసింహ, కె నరసింహ తదితరులు పాల్గొన్నారు