Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 18 ఏండ్లు పైబడిన వారందరికీ టీకాలు
- 45 ఏండ్ల నిండిన ఫస్ట్‌డోస్ కంప్లీట్
నవతెలంగాణ-సిటీబ్యూరో
జలమండలి పారిశుధ్య సిబ్బందితోపాటు 18 ఏండ్లుపైబడిన ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియను అధికారులు బుధవారం ప్రారంభించారు. మొదటి విడతలో భాగంగా 45 ఏండ్లు నిండిన వారికి ఫస్ట్‌డోస్ వ్యాక్సిన్ వేశారు. ఇక 18 ఏండ్లు నిండి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కార్మికుల నుంచి ఉన్నతాధికారుల వరకు వ్యాక్సిన్ వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఎయిర్ టెక్ మెషిన్‌పై పనిచేస్తున్న సిబ్బందితోపాటు ఔట్ సోర్సింగ్ లైన్ మెన్లకు కూడా వాక్సిన్ వేస్తారు. 18 ఏండ్లు పైబడిన వారందరికీ ఫస్ట్‌డోస్ వాక్సినేషన్‌ను గోషామహల్‌లోని సర్కిల్ ఆఫీసులో పర్సనల్ డైరెక్టర్ డి. శ్రీధర్‌బాబు ఆధ్వర్యంలో ప్రారంభించారు. బుధవారం మొత్తం 780 మంది ఉద్యోగులకు హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య అధికారుల సహకారంతో, గోషామహల్లో ఉన్న జలమండలి డిస్పెన్సరీలో వాక్సిన్ వేశారు.
వందశాతం వ్యాక్సిన్
జలమండలిలో పనిచేస్తున్న వారికి వంద శాతం వాక్సిన్ వేస్తామని జలమండలి ఎండీ ఎం.దాన కిషోర్ తెలిపారు. రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా కట్టడికి తమవంతు కృషి చేస్తున్నామన్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో సైతం జలమండలి సిబ్బంది క్షేత్రస్తాయిలో పనిచేస్తున్నారని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌లో మంచినీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నీటి సరఫరా చేస్తున్నామన్నారు. ఇదిలావుండగా వాక్సినేషన్ కార్యక్రమం గురువారం కూడా కొనసాగుతుందని పర్సనల్ డైరెక్టర్ శ్రీధర్ బాబు తెలిపారు. కార్యక్రమంలో సీజీఎం (పి అండ్ ఏ) అబ్దుల్ ఖాదర్, జనరల్ మేనేజర్ ( పి అండ్ ఏ) సరస్వతి పాల్గొన్నారు.