Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్‌రావునగర్
స్వరాష్ట్ర ఆకాంక్షలను, ఫలాలను నెరవేర్చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వీఎస్ బోస్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ఈసీఐఎల్‌లోని నీలం రాజశేఖర్ రెడ్డి భవన్ ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేండ్లు గడుస్తున్నా నేటికి ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, ప్రజల జీవన స్థితిగతులు మారలేదని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర సాధన అనంతరం విభజన చట్ట హామీలను కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో నెరవేర్చేకుండా కాలయాపన చేస్తున్నదని విమర్శించారు. విభజన హామీలను కేంద్రం నుంచి రాష్ట్రానికి సిద్ధింపజేస్తానన్న సీఎం కేసీఆర్ మాటలు నీటిమూటలే అయ్యాయని ఎద్దేవా చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే కాంక్షతో సాగిన తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ ఇంటివరకే ఆ ఆకాంక్షలు నెరవేరయ్యాయని, 4కోట్ల తెలంగాణ ప్రజలను కేసీఆర్ కుటుంబం మోసంచేసిందని ఆయన ఉద్ఘాటించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జి. దామోదర్ రెడ్డి, ఏఐటీయూసీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఎస్.శంకర్ రావు, సీపీఐ కాప్రా కార్యదర్శి జి లక్ష్మీనారాయణ, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు సత్య ప్రసాద్, సహాయ కార్యదర్శి ధర్మేంద్ర, నర్సింహా, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.