Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్
నవతెలంగాణ-నారాయణగూడ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఫలాలు దళిత బహుజన ప్రజలకు దక్కలేదని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ 7వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం హిమాయత్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో నిరసన సభను నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆకాంక్షలకు దొరలు తూట్లు పొడిచారని, మెజార్టీ ప్రజలకు నీళ్లు, నిధులు, నియామకాలు అందలేదని, రాజ్యాంగ హక్కులను సైతం కాలరాస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని, ఆధిపత్య కుల దురహంకారులు చెలరేగిపోతున్నారన్నారు. ప్రజలకు వైద్యం, ఆరోగ్యం అందించడంలో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. కరోనా నిర్మూలనకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాబోయే రోజుల్లో దోపిడీ పాలకులపై తిరగబడాలని, సామాజిక న్యాయం, రాజ్యాధికార సాధనతోనే తెలంగాణలో దళిత బహుజనులకు విముక్తి కలుగుతుందని సూచించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు చేపూరి రాజు, బి.సతీష్ కుమార్, ఇటికాల గణేష్, మద్దెల ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.