Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్కో కార్యాలయ పరిధిలో 100 స్లాట్స్ మాత్రమే
- వినియోగదారులకు కాస్త ఊరట యథావిధిగా వ్యాక్సినేషన్ డ్రైవ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
కరోనా సెకండ్ వేవ్ కట్టడిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఉదయం 6 గంటల నుంచి పది గంటల వరకే ప్రభుత్వ, ప్రయివేటు కార్యాకలాపాలకు అనుమతిని ఇచ్చింది. ఈక్రమంలో రవాణాశాఖ పరిధిలో అందించే ఆర్టీఏ పౌర సేవలకు తాత్కాలిక బ్రేక్‌పడింది. కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో ఇటీవలే సర్కారు లాక్డౌన్ సమయాన్ని ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పెంచింది. ఈ నేపథ్యంలో రవాణాశాఖ తిరిగి ఆర్టీఏ సేవలను పునరుద్ధరించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు తొలుత వాహన రిజిస్ట్రేషన్లు, అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్లకు మాత్రమే స్లాట్లు కేటాయించగా.. వాహనదారుల నుంచి వస్తున్న ఫిర్యాదులతో దిగొచ్చిన రవాణాశాఖ ఎట్టకేలకు అన్ని రకాల సేవలకు స్లాట్లు అందుబాటులోకి ఉంచింది. ఒక్కో ఆర్టీఏ కార్యాలయ పరిధిలో 100 స్లాట్స్లకు అనుమతించింది. అయితే ఇందులోనే వాహన రిజిస్ట్రేషన్లు, ఇతర అన్ని రకాల సేవలకు స్లాట్లు ఉండడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పేలా లేవు.
రద్దీ తగ్గించే దిశగా తక్కువ సంఖ్యలో స్లాట్స్
ఇదిలావుంటే గతంలో మాదిరిగా రవాణాశాఖ పరిధిలోని వాహన రిజిస్ట్రేషన్, అంతర్జాతీయ పర్మిట్, లర్నింగ్, డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్నెస్, రెన్యూవల్, యాజమాని పేరు, చిరునామా మార్పుతో పాటు పలు రకాల సేవలు తాజాగా పున: ప్రారంభమయ్యాయి. అయితే వినియోగదారుల రద్దీ తగ్గిస్తూ భౌతిక దూరం పెంచే యోచనతో రవాణాశాఖ తక్కువ సంఖ్యలో ఆన్లైన్ విధానంలో స్లాట్ల నమోదుకు అవకాశం కల్పించింది. లాక్డౌన్ ముందు వరకు కూడా రవాణాశాఖ గ్రేటర్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా రోజులో సగటున 200 ఎల్ఎల్ఆర్, 150 డ్రైవింగ్ లైసెన్సులు, 200 రిజిస్ట్రేషన్, వంద ఫిట్నెస్ ధ్రువపత్రాలకు పైనే అందించేవారు. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడితో పాటు గ్రేటర్లో ఆటో, క్యాబ్, మాక్సీ డ్రైవర్లకు వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతుండడంతో స్లాట్ల సంఖ్యను కుదించారు. పరిమిత సంఖ్యలోనే సేవలు అందించేందుకు నిర్ణయించారు. దీంతో ఒక్కో కార్యాలయ పరిధిలో రిజిస్ట్రేషన్లకు 50, ఇతర అన్ని రకాల పౌర సేవలకు కలిపి 50 స్లాట్లను మాత్రమే అందుబాటులోకి తెచ్చినట్టు ఆర్టీఏ వర్గాలు పేర్కొన్నాయి. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కార్యాలయాల వద్ద రద్దీని తగ్గించే దిశగా చర్యలు తీసుకున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో లాక్డౌన్, నైట్ కర్ఫ్యూను పకడ్బందీగా అమలవుతున్న నేపథ్యంలో చెక్‌పోస్టుల వద్ద పోలీసులు వాహనదారుల డ్రైవింగ్ లైస్సెన్లు, ఆర్సీలు పత్రాలు చెక్‌చేసి పంపిస్తున్నారు. ఇందులో గడువు తీరిన వారికి ఇబ్బందులు తప్పడం లేదు. లాక్డౌన్ సమయం పెంచడంతో నూతన వాహన క్రయవిక్రయాలు కూడా జోరందుకున్నాయి. సకాలంలో రిజిస్ట్రేషన్ చేసుకుందామంటే తక్కువ సంఖ్యలో స్లాట్ల్ ఉండడం వినియోగదారులకు మింగుడు పడని అంశంగా మారింది.
రవాణాశాఖ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ డ్రైవ్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా రవాణా శాఖ ఆధ్యర్యంలో చేపట్టిన స్పెషల్ డ్రైవ్ విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సూపర్స్పెడ్రర్లకు(ఆటో, మోటర్, మాక్సీ క్యాబ్ డ్రైవర్ల) రవాణా శాఖ అందిస్తున్న వ్యాక్సినేషన్‌కు చక్కటి స్పందన లభిస్తోంది. టీకాను తీసుకోవడానికి వస్తోన్న అర్హులైన డ్రైవర్లందరికీ సిబ్బంది తగిన కోవిడ్ నిబంధనల సూచనలు ఇస్తూ అవగాహన కల్పిస్తున్నారు. గడిచిన మూడు రోజులుగా ఎలాంటి అవరోధాలు లేకుండా కొనసాగింది. అంతేగాక రవాణాశాఖ కమిషనర్ ఎంఆర్ఎం రావు ప్రతిరోజు ఆయా సెంటర్లను పర్యవేక్షిస్తున్నారు. వ్యాక్సినేషన్ కేంద్రాలకు ఇన్చార్జిలుగా ఆర్టీవోలు ఉండడంతో పాటు సిబ్బంది సైతం ఇదే పనిలో నిమ్నగమయ్యారు. సగానికిపైగా ఆర్టీఏ సిబ్బందికి ఇదే డ్యూటీ ఉండడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం లేని డ్రైవర్లకు సంబంధించి వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కూడా సిబ్బంది చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్టీఏ ఉన్నతాధికారులు అతి తక్కువ సంఖ్యలో స్లాట్లను అందుబాటులోకి తెచ్చినట్టు ఓ ఆర్టీఏ అధికారి అభిప్రాయం వ్యక్తం చేశారు.