Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- 150 మందికి నిత్యావసర వస్తువులు అందజేత
నవతెలంగాణ-హైదరాబాద్
పారిశుధ్య కార్మికుల సేవలు అమోఘం, అభినందనీయమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక 3వ వార్డు టీఆర్ఎస్ ఇన్చార్జి రేఖారాణి బాల్‌రాజ్ తన సొంత డబ్బులతో కార్పొరేషన్లో పనిచేస్తున్న 150 మంది పారిశుధ్య కార్మికులకు ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం, నూనె, కంది పప్పు, ఇతర వస్తువులు పంపిణీ చేశారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కరోనాను ఇతరులకు సోకకుండా కార్పొరేషన్ మొత్తం శుభ్రంగా ఉండటానికి కారణం పారిశుధ్య కార్మికులేనన్నారు. వారు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారని, వారి సేవలకు ఎంత ఇచ్చిన తక్కువేనన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని మాస్కులు, శానిటైజర్లు వాడాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌవాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షురాలు సిద్దాల లావణ్య, సీఐ మహేందర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.
మీర్పేట్లో రూ. 5 ఇడ్లీ హబ్ ప్రారంభం
మీర్పేట్ చౌరస్తాలో ఆర్యన్ క్యూర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కామోజి శోభారాణి మల్లికార్జున్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐదు రూపాయల ఇడ్లీ హబ్‌ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా పనులు లేక ఆకలితో అలమటిస్తున్న పేదలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. 5 రూపాయలకే ప్లేట్ ఇడ్లీ ఇవ్వడాన్ని అభినందించారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ కరోనా సమయంలో సేవ చేయడం పట్ల మక్కువ చూపేందుకు ఐదు రూపాయలకు ప్లేట్ ఇడ్లీ పచ్చడి, తాగునీరు ఉంటాయని, ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు పంపిణీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీప్ లాల్ చౌవాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, సీఎస్సీ అకాడమీ స్టేట్ హెడ్ రాజ్ కిషోర్, రాజేశ్వర్ రెడ్డి, ఫ్లోర్‌లీడర్ అర్కల భూపాల్ రెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షురాలు సిద్దాల లావణ్య, స్థానిక కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.