Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్ల చేపలకు రూ.600
- తెల్ల చేపలకు రూ.300 మద్దతు ధర ప్రకటించాలి
- మత్స్యకార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గోరెంకల నర్సింహ
నవతెలంగాణ-తుర్కయాంజల్
మృగశిర కార్తీని చేపల పండుగగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని మత్స్యకార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింహ డిమాండ్ చేశారు. సోమవారం తుర్కయాంజల్ మున్సిపాలిటీ కోహెడ పెద్ద చెరువులో చేపలు పడుతున్న మత్స్యకార్మికులతో మాట్లాడారు. చేపలు చాలా పోషక విలువలు గల ఆహారం అనీ, గుండె జబ్బు లు, కిడ్నీ సమస్యలు, కంటి చూపు వంటి వాటికి బాగా పని చేస్తుందని డాక్టర్లు, నిపుణులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారని తెలిపారు. జూన్ 8వ తీదీన మగశిర కార్తె నుంచి ప్రకృతిలో వాతావరణ మార్పులు ఏర్పడతాయనీ, దీంతో వేడిగా ఉన్న వాతావరణం చల్లబడుతుందని తెలిపారు. అప్పటి నుంచి నాలుగు నెలల వరకు చల్లగా ఉండటంతో మనిషి శరీరంలో కూడా మార్పులు జరుగుతాయనీ, మృగశిర కార్తె రోజున చేపలు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగు తుందనీ, శరీరంలో వేడి ఉంటుందనీ, సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయనీ తెలిపారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వల్ల మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారనీ, లాక్డౌన్తో చేపల అమ్మకానికి ఆటంకం ఏర్పడుతుందని తెలిపారు. సరైన మార్కెట్ విధానం లేక మత్స్యకారులు నష్టపోతున్నారనీ, చేపలకు మద్దతు ధర ప్రకటించాలని కోరారు. తెల్ల చేపలకు రూ.300, నల్ల చేపలకు రూ.600 ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. మత్స్యకారులకు రుణాలు మంజూరు చేయాలనీ, కరోనా కాలంలో ప్రతి మత్స్యకార కుటుంబానికి నెలకు రూ.7,500 ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోహెడ సొసైటీ అధ్యక్షులు యర్ర లక్ష్మణ్, సెక్రెటరీ పసుల దేవేందర్, సాదు యాదగిరి, రంగయ్య, తదితరులు పాల్గొన్నారు.