Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్మెట్
పెద్ద అంబర్పేట పురపాలక సంఘం అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.15.50 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు టీఆర్ఎస్ నాయకులు తెలిపారు. మంగళవారం పెద్ద అంబర్ పేట టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఈదమ్మల బలరాం ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న చిరంజీవి అధ్యక్షతన విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణీకరణ అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కుంట్లూర్ వై జంక్షన్ నుంచి రాజీవ్ గృహకల్ప వరకు సీసీ రోడ్డు నిర్మాణం, తట్టి అన్నారం అంబేద్కర్ చౌరస్తా నుంచి మర్రిపల్లి వరకు బీటీ రోడ్డు, పెద్ద అంబర్ పేట నుంచి పసుమాముల వరకు డ్రయినేజీ పనులు, పెద్ద అంబర్ పేటలో వెజిటేబుల్, నాన్ వెజ్ టేబుల్ కూరగాయల మార్కెట్ ఏర్పాటుకు నిధులు కేటాయించామని తెలిపారు. పట్టణ పరిధి క్రమంగా విస్తరిస్తుండడంతో అందుకు తగిన మౌలిక వసతులు ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. పురపాలక సంఘం అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు సిద్దెంకి కృష్ణారెడ్డి, విద్యావతి, చెవుల హరిశంకర్, కోటేశ్వరరావు, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పాశం దామోదర్, సీనియర్ నాయకులు అనంతుల వెంకటేశ్వర్ రెడ్డి, దేవిడి విజయ భాస్కర్ రెడ్డి, గోవర్ధన్ ప్రవీణ్ కుమార్, నాగార్జున, ఎండీ సత్తార్ తదితరులు పాల్గొన్నారు.