Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హస్తినాపురం
కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక చర్యలు మానుకోవాలనీ, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ఎల్బీనగర్ ఆటో జంక్షన్ వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కీసరి నర్సిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించాలన్నారు. నెల రోజుల్లో 20 సార్లు పెంచడం దారుణం అన్నారు. రోజురోజుకూ నిత్యావసర సరుకులు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారనీ, పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించి ప్రజలపై భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. కరోనా కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి ప్రజలు జీవనం సాగించడం భారంగా మారిందన్నారు. తక్షణమే ధరలను తగ్గించి డీజిల్, పెట్రోల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. ఆటో కార్మికులు పనుల్లేక అనేక అవస్థలకు గురవుతున్నారనీ, ఫైనాన్స్ చెల్లించలేక వారి బతుకు దుర్భరంగా మారిందనీ, ఆటో కార్మికులకు నెలకు రూ.7 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ కార్యదర్శి ఊదరి రమేష్, పాండు నాయక్, ఎం.బాలు, కె.నగేష్, బి.నరేష్, పి.రమేష్, తిరుపతి, పి.బిక్కు, కృష్ణ, ప్రసాద్, జంగయ్య, రమేష్, తదితరులు పాల్గొన్నారు.