Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బల్దియా అధికారులపై మేయర్ సీరియస్
- ఎమ్మెల్యే కాలేరుతో కలిసి అంబర్‌పేట్‌లో పర్యటన
నవతెలంగాణ-సిటీబ్యూరో/అంబర్‌పేట
'గోల్నాక నాలాల్లో పూడిక ఎందుకు తీయలేదు. వారం రోజుల్లో పూర్తి చేయాలి' అని జీహెచ్ఎంసీ అధికారులపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తంచేశారు. అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌తో కలిసి నియోజకవర్గంలో నాలాలు, పారిశుధ్య పనులను బుధవారం తనిఖీ చేశారు. గోల్నాక నాలా వద్ద మట్టికుప్పలు, చెత్తను వెంటనే తొలగించాలని మేయర్ ఆదేశించారు. తరువాత బాపునగర్ వద్ద డ్రయినేజీ లైన్లను సందర్శించిన మేయర్ అక్కడ ఇళ్లలో నుంచి నేరుగా డ్రయినేజీలో చెత్త వేయడం గమనించి మొత్తం క్లీన్చేయడంతోపాటు నీటి ప్రవాహం ఆగకుండా చూడాలని చెప్పారు. వరదనీటికాలువ, డ్రయినేజీ రెండు కలిపి ఉండడంతో డ్రయినేజీ బ్లాక్ అవుతుండడంతో వెంటనే సమస్యను పరిష్కరించాలని చెప్పారు. తరువాత బతుకమ్మకుంటలో పర్యటించారు. స్వచ్చ ఆటోల పార్కింగ్ ఇబ్బందిని స్థానికులు తన దష్టికి తీసుకురాగా అక్కడే ఉన్న ఓ ప్రయివేట్ల్యాండ్ వారి సాయంకోరి గేట్ ఓపెన్ చేయించి ఆటోలు అక్కడ ఉన్న మట్టికుప్పలను తొలగించి స్వచ్చ ఆటోలను పార్క్ చేసుకునే విధంగా చేయాలని అధికారులను ఆదేశించారు. శివానందనగర్లోని ఫీవర్ హాస్పిటల్ దగ్గర నాలాను పరిశీ లించారు. మూడు అడుగుల లోతు పూడికను తీసేసి చెత్తను క్లీన్ చేయాలని ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్, మెడికల్ ఆఫీసర్లను ఆదేశించారు. చిక్కడపల్లి నాలాను పరిశీలించిన మేయర్ అక్కడ పారిశుధ్య పనులను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. అనంతరం అంబర్‌పేట 6వ నెంబర్ చౌరస్తా వద్ద మాజీ కార్పొరేటర్ పద్మావతి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, కార్పొరేట్లతో కలిసి మేయర్ మాస్క్‌లను పంపిణీ చేశారు. అంతకుముందు అఫ్జల్‌గంజ్‌లోని గురుద్వారా శ్రీగురుసింగ్సభ, అపోలో హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో జరిగే వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌తో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మహాలక్ష్మి రామన్‌గౌడ్, ఉమారాణి, అమృత, దూసరి లావణ్యశ్రీనివాస్‌గౌడ్, పద్మ వెంకట్‌రెడ్డి, డిప్యూటీ కమిషనర్ వేణుగోపాల్, ఈఈ శంకర్, డీఈలు సంతోష్, సుధాకర్, ఏఈలు, ప్రేరణ, శ్వేత, ఫరీద్, మెడికల్ ఆఫీసర్ హేమలత, టౌన్‌ప్లానర్ సాయిబాబా, నాయకులు బి.వెంకటరెడ్డి, సిద్దార్థ్ ముదిరాజ్, మధు యాదవ్, నర్సింగ్ యాదవ్ పాల్గొన్నారు.