Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రామంతపూర్ భగాయత్‌లో ఆక్రమణ, గోడ నిర్మాణం
- చర్యలు తీసుకోవాలని కాటి కాపరుల సంఘం డిమాండ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
అక్రమ నిర్మాణాలు, భూ కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ పదేపదే హెచ్చరిస్తున్నారు. కబ్జాలు చేస్తే ఎంతటి వారైనా ఊపేక్షించేది లేదని అనేకసార్లు ప్రకటించారు. అయినా సరే కొందరు కబ్జాదారులు చెరువులు, దేవాలయాలు, చివరకు శ్మశాన వాటిక జాగాలను కూడా వదలడం లేదు. రాత్రికి రాత్రే కబ్జాచేసి నిర్మాణాలు చేసేస్తున్నారు. ఇదే తరహాలో రామంతాపూర్ భగాయత్‌లోని శ్మశాన వాటికను కబ్జాదారులు ఆక్రమించేశారు. కబ్జాచేసి యథేచ్ఛగా ప్రహరీ నిర్మించారంటూ హిందూ స్మశాన వాటికల కాటి కాపరుల సంఘం ప్రతినిధులు తెలిపారు. గతంలో అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆర్టీఐ ద్వారా అసలు విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. కబ్జాచేశారంటూ సాక్ష్యాధారాలతో బయటపెట్టారు. శుక్రవారం హిందూ శ్మశాన వాటికల కాటి కాపరుల సంఘం అధ్యక్షులు వల్ల జంగయ్య, ప్రధాన కార్యదర్శి వల్ల సత్యనారాయణ, కోశాధికారి వి.బాబురావు, ఆ సంఘం సభ్యులు సుధాకర్, పర్శరామ్లు వివరాలను వెల్లడించారు. రామంతాపూర్ పరిధిలోని రాజేంద్రనగర్, నేతాజీ నగర్, రామంతాపూర్ భగాయత్ (డ్రయినేజీ నాలా)లో మూడు హిందూ శ్మశాన వాటికలున్నాయన్నారు. రామంతాపూర్ భగాయత్, సర్వే నెంబర్ 52/13లో 8 గుంటల విస్తీర్ణంలో హిందూశ్మశాన వాటిక ఉందని వివరించారు. ఎన్నోఏండ్ల నుంచి ఉన్న శ్మశానవాటిక స్థలాన్నే కబ్జాచేశారని తెలిపారు. 2015లో కొంత భూమిని కబ్జా చేయడంతో ఆ విషయాన్ని అప్పటి ఎమ్మెల్యేతోపాటు తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లామని, కానీ ప్రయోజం లేకుండా పోయిందని అన్నారు. కొన్నాళ్లపాటు దూరంగా ఉన్న కొందరు వ్యక్తులు తిరిగి కబ్జాకు పాల్పడ్డారని, యథేచ్ఛగా గోడ నిర్మించారన్నారు. రాత్రికి రాత్రే బోరు వేశారని తెలిపారు. శ్మశానవాటికలో బోరు వేసేందుకు అనుమతులు ఎలా తీసుకున్నారో విచారించాలని కోరారు. ప్రభుత్వ భూములను పరిరక్షిస్తామంటూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంతోపాటు కబ్జాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నా కబ్జాదారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి శ్మశానవాటిక స్థలాన్ని కబ్జాదారుల నుంచి రక్షించి, చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.