Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన
- జీవో ప్రతులు దహనం
నవతెలంగాణ-నారాయణగూడ
ప్రభుత్వం ఉద్యోగుల జీతాల విషయంలో విడుదల చేసిన జీవో నెంబర్ 60తో ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిం దని, దానిని వెంటనే ఉపసంహరించుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్. బోస్ డిమాండ్ చేశారు. ఔట్ సోర్సింగ్ కార్మికులందరికీ చట్టప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ వేతనాన్ని అమలు చేయాలని కోరారు. ఏఐటీయూసీ నగర సమితి ఆధ్వర్యం లో శనివారం హిమాయత్‌నగర్‌లోని ప్రభుత్వం జారీచేసిన జీవో ప్రతులను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వి.ఎస్.బోస్ మాట్లాడుతూ.. ఏడేండ్ల కిందట తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇచ్చిన జీ.ఓ-14లో కార్మికులకు అన్యాయం జరిగిందని, అదే అన్యాయం మరోసారి ఈ పీఆర్సీలో ఔట్సోర్సింగ్ సిబ్బందికి జరిగిందని అన్నారు. అతి తక్కువ జీతాలతో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఏడేండ్లు ఎదురుచూసినా నిరాశే మిగిలిందని, సుప్రీంకోర్టు తీర్పు, రాష్ట్రంలో కార్మికుల ఆందోళనలు సైతం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జీవోనెంబర్ 60ను ఉపసంహరించుకోకపోతే ఆందోళ నలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షులు ఎం.డీ.యూసుఫ్, నగర ప్రధాన కార్యదర్శి ఎం.నర్సింహ, కోశాధికారి బి.కిషన్, కార్యదర్శి ఎం.లక్ష్మీబాయి, ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి ఎం.సత్యం, జీహెచ్ఎంసీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ నాయకులు జి.నరేందర్‌రెడ్డి, మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ నాయకులు సుందర్, సంతోష్ పాల్గొన్నారు.