Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈనెల 15లోపు వివరాలు చైల్డ్ ఇన్ఫోలో పొందపరుచనున్న అధికారులు
- వయసు ఆధారంగా బడుల్లో చేర్పించేందుకు చర్యలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
కరోనా కారణంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. పెద్దసంఖ్యలో విద్యార్థులు చదువులకు దూరమయ్యారు. కొంతమంది పిల్లలు పనులకు వెళ్తున్నారు. మరికొంతమంది పిల్లల తల్లిదండ్రులు ఏకంగా నగరాన్ని వదిలేసి సొంతూర్లకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్లో అందుబాటులోకి తీసుకువచ్చినా ఆన్లైన్ క్లాసులు కొంతమేర విద్యార్థులకు మేలు చేసినా ఫలితాలు నామమాత్రంగానే ఉన్నాయి. ఇదిలావుంటే విద్యాశాఖ ప్రతి సంవత్సరం సర్వే నిర్వహించి బడిఈడు పిల్లలను గుర్తిస్తోంది. వారి వయస్సుకు తగ్గట్టుగా ఆయా పాఠశాలల్లో చేర్పిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరిలో సర్వే చేపట్టి 6-14ఏండ్లలోపు బడి బయట పిల్లలను గుర్తించిన విషయం విదితమే. ఇదే సమయంలో 15 నుంచి 19 ఏండ్ల పిల్లలు సైతం కొందరు బడిబయట ఉంటూ విద్యకు దూరమవుతున్నారు. వారిని కూడా గుర్తించి ఆయా తరగతుల్లో చేర్పించే విధంగా జిల్లా విద్యశాఖ ఇటీవలే సర్వే చేపట్టింది.
ఈ నేపథ్యంలో 15 నుంచి 19 ఏండ్లలోపు వయస్సు గల బడి బయట ఉన్న పిల్లలను గుర్తించేందుకు విద్యాశాఖ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. ఇందులో మండల అధికారులు, క్లస్టర్ హెచ్ఎంలు, సీఆర్పీలు, ఐఈఆర్పీలు, డీఎల్ఎంటీలు ఆయా మండలాల్లో సర్వే చేపట్టి వివరాలు సేకరిస్తున్నారు. అలా వారి జాబితాను క్లస్టర్ హెడ్మాస్టర్ల ద్వారా మండల విద్యాధికారికి అందిస్తారు. వారు సర్టిఫై చేసి జిల్లా విద్యాశాఖకు పంపుతారు. ఇలా ఇప్పటివరకు వచ్చిన వివరాలు చూస్తే.. 15-19 ఏండ్లలోపు పిల్లలు.. 37 మంది బాలురు.. 26 మంది బాలికలతో కలిపి మొత్తం 63 మందిని గుర్తించారు. అలాగే 6-14 ఏండ్లలోపు వారు 230 బాలురు, 219 బాలికలు మొత్తం 449 మంది పిల్లలను గుర్తించారు. ఇందులో ఇప్పటివరకు 139 పిల్లలకు సంబంధించిన సమాచారాన్ని చైల్డ్ ఇన్ఫోలో అప్లోడ్ చేయగా.. వీరిలో 68 బాలురు, 71 బాలికలు ఉన్నారు. మిగతా పిల్లల సమాచార ఆన్లైన్ ప్రక్రియ కొనసాగుతోంది. దీనిని ఈ నెల 15వరకు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇదిలావుండగా.. గతంలో గుర్తించిన వారితో పాటు ప్రస్తుతం జరుగుతున్న సర్వే సందర్భంగా గుర్తించిన పిల్లలందరినీ వారి వయస్సు ఆధారంగా బడిలో అధికారులు చేర్పించేందుకు చర్యలు తీసుకుంటారు. దీనికిముందు గతంలో గుర్తించిన పిల్లలు పాఠశాలలో చేరారా.. లేదా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారా..ఇతర ప్రాంతాల నుంచి వలస ఏమైనా వచ్చారా.. అనేది ఈ సర్వేలో గుర్తిస్తారు. ఆ తర్వాత అందరిని పాఠశాలలో చేర్పించనున్నారు.