Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేమేమీ చేయలేం - జీహెచ్ఎంసీ
నవతెలంగాణ-హైదరాబాద్
కరోనా ఊహించని విధంగా మానవాళి జీవితాల్లో కల్లోలం రేపింది. దీనిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. దీంతో రోడ్లన్నీ బోసిపోయి వ్యాపార కార్యకలాపాలు లేకుండా ఖాళీగా కనిపిస్తున్నాయి. పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అత్యవసరమైతేనే అదికూడా తగిన ఆధారాలు ఉంటేనే పంపుతున్నారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారడంతో వీధి కుక్కలు రోడ్లపైకి వచ్చి ఇష్టారాజ్యంగా తిరుగుతున్నాయి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో అత్యవసర పనుల నిమిత్తం వెళ్ళేవారి వెంటపడి మరీ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. లాక్డౌన్ కారణంగా వాటికి తిండి దొరకక రోడ్డుపై ఎవరు కనిపిస్తే వారిపై బడి కరుస్తున్నాయి. ఇకపోతే కాలనీలలో పిల్లలు ఆడుకోవడానికి బయటకు వస్తే వారిని సైతం వదలటంలేదు. ప్రతీ చోట ఇష్టారాజ్యంగా కుక్కలు స్వౌరవిహారం చేస్తున్నా కూడా జీహెచ్ఎంసీ అధికారులు అసలు ఆ విషయం తమకు సంబంధించింది కాదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఏదైనా సంఘటన చోటుచేసుకున్నపుడు మాత్రం నామ మాత్రంగా తమ సిబ్బందిని పంపి ఒకటో రెండో కుక్కలను పట్టుకుని చేతులు దులుపుకుం టున్నారు. ఈ సందర్భంగా వనస్థలిపురం సచివాలయనగర్‌లో కుక్కల బెడద అధికంగా ఉందన్న ఫిర్యాదు మేరకు డాగ్‌స్క్వాడ్ వచ్చిన సందర్భంగా స్థానికులు సిబ్బందితో తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అందుకు సిబ్బంది మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మమ్మల్ని నిలదీస్తే ఎలా? మేము మా డ్యూటీ మేము చేస్తున్నాం. కుక్కలను చంపే అధికారం మాకు లేదు. జంతుప్రేమికులు కోర్టులో కేసు వేసినందున సుప్రీం కోర్టు జంతువులను చంపరాదని, వాటికి పిల్లలు కలగకుండా ఇన్జెక్షన్లు ఇచ్చి తిరిగి వాటిని యధాస్థానంలో వదిలేయమని ఆర్డరు ఉంది. అందుకే మేము కుక్కలను తీసుకెళ్ళి వాటికి ఇంజెక్షన్లు ఇచ్చి తిరిగి వాటిని వాటి స్థానంలో వదిలేయాల్సి వస్తోంది. అందువల్లనే మీకు కుక్కలు ఎక్కువగా కనిపిస్తున్నాయని సమాధానం ఇచ్చారు. ఇలా అయితే అవి కరిస్తే తమ పరిస్థితి ఏమిటని వాటినుంచి రక్షణ ఎలా పొందాలని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.