Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్కో జోన్‌కు ఒక ప్రత్యేకాధికారి మంత్రి
- మేయర్ కార్యాలయాల్లో ఫోన్ నెంబర్ కేటాయింపు
నవతెలంగాణ-సిటీబ్యూరో/బేగంపేట్
జంట నగరాల పరిధిలోని నాలాల్లో పేరుకపోయిన పూడిక తొలగింపు పనులపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలను చేపట్టింది. జీహెచ్ఎంసీ, వాటర్‌బోర్డు అధికారుల సమన్వయంతో పౌరఫిర్యాదులను పరిష్కరించడానికి ఏర్పాట్లు చేసింది. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్ కార్యాలయాలకు ప్రత్యేక ఫోన్ నెంబర్లను కేటాయించారు. దీంతోపాటు జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్లల్లో ఒక్కో జోన్‌కు ఒక్కో అధికారిని కేటాయించారు. వీటిలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ కార్యాలయం 9848282309, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కార్యాలయం 9030066666 నెంబర్లను కేటాయించారు. జీహెచ్ఎంసీ హెల్ప్‌లైన్ 21111111, మైజీహెచ్ఎంసీ యాప్‌లకు సైతం ఫిర్యాదు చేయడానికి అవకాశముందని, వీటిని వినియోగించుకోవాలని నగరపౌరులకు జీహెచ్ఎంసీ సూచించింది. అయితే జోన్లవారీగా కేటాయించిన అధికారులు వివరాలు ఇలా ఉన్నాయి.
నాలా పనులను వేగవంతం చేయాలి : మంత్రి తలసాని
నాలాల్లో పూడికతీత పనులను వేగవంతం చేయాలని, ఏమైనా సమస్యలు ఉంటే జీహెచ్ఎంసీ కేటాయించిన ఫోన్ నెంబర్లకు ఫిర్యాదు చేయాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించారు. సోమవారం ఆయన కార్పొరేటర్ మహేశ్వరి, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, చీఫ్‌ఇంజినీర్ దేవానంద్, సూపరింటెండెంట్ ఇంజినీర్ అనిల్‌రాజ్, ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ శివానంద్, వాటర్‌బోర్డు జనరల్ మేనేజర్ రమణారెడ్డి తదితర అధికారులతో కలిసి బేగంపేట నాలాలో జరుతుగున్న పూడిక తొలగింపు పనులను పరిశీలించారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో పూడిక తొలగింపు పనులను మరింత వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. బేగంపేట నుంచి బ్రాహ్మణవాడి వరకు నాలాకు రిటైనింగ్‌వాల్‌ను నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డిని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాలాల్లోని పూడిక తొలగింపు కోసం రూ.45కోట్లను ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. నేటి నుంచి ఈ నెల 19 వ తేదీ వరకు వారం రోజుల పాటు ఈ పనులను ప్రతినిత్యం స్పెషల్ డ్రైవ్‌గా పర్యవేక్షించనున్నట్టు వివరించారు. మేయర్, కమిషనర్ కూడా వేరు వేరు ప్రాంతాలలో పనులను పర్యవేక్షించినట్లు చెప్పారు. ఎన్నో సంవత్సరాల క్రితం నిర్మించిన నాలాలు కావడంతో పెరిగిన జనాభాకు అనుగుణంగా లేకపోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా నాలాల అభివృద్ధి, నిర్మాణ పనులు చేపట్టేందుకు అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు.