Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.500ల చీరకు... రూ.1.20 లక్షల వసూలు
- ఆన్లైన్ గేమింగ్‌తో రూ.1:20 లక్షలు మాయం
- అత్యాశకుపోవద్దు : ఏసీపీ : కేవీఎం ప్రసాద్
బాధితులు చాలామంది అత్యాశకుపోయి సైబర్ నేరస్థుల ఉచ్చులో చిక్కుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులతో చాటింగ్ చేయడం, వివరాలను వెళ్ల్లడించడం చేయవద్దు.ఆన్లైన్ సమాచార సేకరణలో, వస్తువుల కొనుగోలులో జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు పంపించాలని ఎవరైనా కోరితే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి.
నవతెలంగాణ-సిటీబ్యూరో
సైబర్ నేరగాళ్లు రోజుకో తీరులో రెచ్చిపోతున్నారు. ఆన్లైన్ పరంగా ప్రతీ అంశాన్ని తమకు అనుకూలంగా మల్చు కుంటున్నారు. తాజాగా రుణాలిప్పిస్తామని, కరోనా మందులు ఉచితంగా పంపుతామని, ఓ.ఎల్.ఎక్స్, షాదీ, నౌకరీ డాట్కామ్తోపాటు ఉద్యోగాలు ఇప్పిస్తామని, బీమా డబ్బులు ఇప్పిస్తామమని అందినకాడికి దండు కుంటున్నారు. కొద్ది నెలల క్రితం నగరంలోని ఓ గృహిణి గ్యాస్‌బుక్ చేద్దామని వెబ్సైట్లో ఫోన్‌నెంబర్ కోసం సెర్చ్చేసింది. ఈ క్రమంలో సైబర్ నేరస్థుల వలలో పడి సదురు గృహిణి లక్షలు పోగొట్టుకుంది. తాజాగా ఓ మహిళ ఆన్లైన్లో చీరను కొనుగోలు చేసింది. దాన్ని వాపస్ చేద్దామని ఫోన్‌నెంబర్‌ను సెర్చ్చేస్తున్న సమయంలో సైబర్ నేరస్థులకు చిక్కింది. రూ.500 చీరకు రూ.1.20 లక్షలను సమర్పించుకుంది. కష్టపడి సంపాదించిన సొమ్ము క్షణాల్లో మాయం కావడం, బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు ట్రాన్స్ఫర్ కావడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. డిజిటల్ లావాదేవీలను ఆసరాగా చేసుకుంటున్న సైబర్‌నేరగాళ్లు క్యాష్ బ్యాలెన్స్ వచ్చిందని లింక్‌లు పంపిస్తున్నారు. వాటిని క్లిక్ ఖాతాదరుల ఓటీపీ, ఖాతా వివరాలు సైబర్నేరగాడికి తెలిసిపోతున్నాయి. కంచన్‌బాగ్‌లో నివాస ముంటున్న అమిత్ భట్టాచార్జ్ డీఆర్డీఓలో సైంటిస్ట్. తనవద్ద ఉన్న ఓ బెడ్‌ను విక్రయిద్దామనుకుని ఓ.ఎల్.ఎక్స్‌లో ప్రకటన ఇచ్చాడు. వెంటనే అతని సెల్‌ఫోన్‌కు ఓ మెసేజ్ వచ్చింది. ఎంతైనా పర్వాలేదు కొనుగోలు చేస్తామని దాని సారాంశం. ఆన్లైన్లో డబ్బులను ట్రాన్స్ఫర్ చేస్తామని ఓ లింక్‌ను పంపించారు. ఇంకేముంది ఆలింక్ను క్లిక్ చేయగానే అమిత్ భట్టాచార్జ్ ఖాతాలోని డబ్బులు దశలవారీగా రూ.80 వేల వరకు సైబర్ నేరస్థులు దండుకున్నారు. అంబర్‌పేట్‌లో నివాసముంటున్న కమలా అనే గృహిణి ఆన్లైన్లో 'రుద్రాసిల్క్స్' షాపింగ్‌మాల్‌లో చీరకొనుగోలు చేసింది. నచ్చకపోవడంతో వాపస్ ఇవ్వాలనుకుంది. గూగుల్ కస్టమర్స్ ఆన్లైన్లో వివరాలను సెర్చ్చేస్తున్న సమయంలో సైబర్ నేరస్థులు గాలం వేశారు. మాయమాటలతో రూ.1.20 లక్షలను దండుకున్నారు. తిరుమలగిరిలో నివాసముంటున్న మీనాక్షి కుమారుడు ఆన్లైన్లో గేమ్స్ ఆడి రూ.1.20 లక్షలను పొగొట్టుకున్నాడు. ఫలక్ నుమాకు చెందిన సొనాలి నౌకరీ డాట్‌కామ్‌లో ధరఖాస్తు చేసుకుంది. టీసీఎస్‌లో మంచి ఉద్యోగం ఇప్పిస్తామని సైబర్ నేరగాళ్లు ఆమెను నమ్మబలికారు. ఆన్లైన్లో నకిలీ ఇంటర్వ్యూ నిర్వహించారు. మాయ మాటలతో రూ.1.50 లక్షల వరకు దండుకున్నారు.