Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా కట్టడిలో పోలీసులది పాత్ర ఎనలేనిది
- కథనాల్లో నిజం లేదు
- తెలంగాణ స్టేట్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సిెటీ అధ్యక్షులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
కరోనా కట్టడిలో పోలీసులు తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ముందువరసలో ఉండి పనిచేస్తున్నారని తెలంగాణ స్టేట్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ హైదరాబాద్ సిటీ అధ్యక్షులు ఎన్.శంకర్‌రెడ్డి అన్నారు. 15 నెలలుగా కుటుంబసభ్యులకు దూరంగా ఉంటూ 24 గంటలపాటు ప్రజల రక్షణకోసం పనిచేస్తున్నారని గుర్తు చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. కరోనా, లాక్డౌన్ సమయంలో ప్రజలు ఇండ్లల్లోనే ఉండేలా చర్యలు తీసుకున్నారని, చివరకు ప్రజలకు దండం పెడుతూ కూడా అవగాహన కల్పించారని చెప్పారు. పోలీసులు రోడ్లపై డ్యూటీలు చేస్తూ ప్రజలు ఇండ్లల్లో ఉండేలా ఎంతో గొప్పగా కృషి చేశారన్నారు. కరోనా కష్టకాలంలో గతేడాది, ఈసారి కూడా విరామం లేకుండా పోలీసులు చేసిన కృషి ఎనలేనిదన్నారు. లాక్డౌన్, బందోబస్తు విధులేగాకుండా అవసరమైన సేవా కార్యక్రమాల్లో కూడా పోలీసులు ముందు వరుసలో ఉన్నారని గుర్తు చేశారు. గతేడాది ఆర్థికంగా ఇబ్బందులకు గురైన వలస కూలీలను వారి ఊళ్లకు తరలించడంతో కీలక పాత్రపోషించారని, కంటోన్మెంట్ జోన్లలో సేవలందించారని తెలిపారు. సెకండ్ వేవ్‌లోనూ వారి సేవలు అమోఘమని కొనియాడారు. కరోనా కట్టడికి పాటుపడుతునన క్రమంలో పోలీసులు కూడా కరోనా బారిన పడినవారు ఎంతోమంది ఉన్నారని చెప్పారు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఐదువేల మంది పోలీసులు కరోనా బారిన పడగా, దాదాపు 51 మందికిపైగా ప్రాణాలు అర్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు అందిస్తున్న నిస్వార్థ త్యాగానికి దేశ, విదేశాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయన్నారు. అయినాకూడా కొందరు పనిగట్టుకుని పోలీసులను అప్రతిష్టపాలు చేయాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఓ వార్తాపత్రిక కావాలనే గత 10 రోజులుగా పోలీసులపై తప్పుడు కథనాలను ప్రచురిస్తోందన్నారు. ప్రజల భద్రతే ధ్యేయంగా పనిచేస్తున్న పోలీసులను నిరాశపరిచే చర్యలు కరెక్టు కాదన్నారు. నిరాధారమైన కథనాలను, అసత్యాలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఆ కథనాల్లో నిజం లేదన్నారు.